స్విమ్స్‌లో అగ్నిప్రమాదం

9 Jan, 2019 11:59 IST|Sakshi
అగ్రిప్రమాదంలో కాలి బూడిదైన గదిలోని వస్తువులు

దగ్ధమైన యూరాలజీ ఐసీయూలోని ప్రత్యేక గది

దట్టంగా కమ్ముకున్న పొగలు భయాందోళనతో రోగుల పరుగు

ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అధికారుల వెల్లడి

చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : స్విమ్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం 11.15 గంటలకు యూరాలజీ విభాగం ఐసీయూలోని ప్రత్యేక గదిలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం ధాటికి గది పూర్తిగా దగ్ధమైంది. గదిలోని పీయుపీ షీట్లు, ఏసీ ఉపకరణాలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం బారిన పడి ఎవరూ గాయపడలేదు.

ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం సంభవించిందని స్విమ్స్‌ అధికారులు వెల్లడించారు. మరో వైపు కనీసం ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ విభాగం విద్యుత్‌ సమస్యలను సకాలంలో మరమ్మతులు చేయకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. యూరాలజీ విభాగం ఐసీయూలో 25 మందికిపైగా రోగులు చికిత్స పొందుతున్నారు. విద్యుత్‌ సరఫరా అంతరాయం, వైర్ల మరమ్మతు పనులపై ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం నిర్లక్ష్యం వహించడ వల్లే షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రమాణాలకు అనుగుణంగా లేని విద్యుత్‌ వైర్లు వినియోగించినా, హైఓల్టేజీ సంభవించినా షార్ట్‌ సర్క్యూట్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆస్పత్రికి వచ్చిన అగ్నిమాపక అధికారి సహదేవ నాయక్‌కు స్విమ్స్‌ అధికారులు షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం సంభవించిందని చెప్పుకొచ్చారు.

తప్పిన పెనుప్రమాదం
యూరాలజీ ఐసీయూ ప్రత్యేక గదిలో అగ్నిప్రమాదం సంభవిస్తే కనీసం భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించలేదని అక్కడే ఉన్న రోగుల ఆరోపణ. దట్టంగా∙పొగలు వ్యాపించిన తరువాతే మంటలు అదుపు చేశారు. తరువాత అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు గదిలోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. యూరా లజీ ఐసీయూ రోగులకు ఇబ్బందులు లేకుండా మరో వార్డులో వైద్య సేవలు అందించారు. రోగుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటించే స్విమ్స్‌ ఉన్నతాధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని వార్తలు