ఉపాధినిచ్చే వల ఊపిరి తీసింది

3 Jul, 2019 08:05 IST|Sakshi
వాయిల పోలయ్య మృతదేహాన్ని చూసి విలపిస్తున్న కుటుంబసభ్యులు

కడలి కెరటాలతో సయ్యాటలాడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఒడుపుగా వల విసరడంలో అతడు నేర్పరి. నిత్యం అలవోకగా చేసే పనే అయినా.. విధి వక్రీకరించింది.. తనకు ఉపాధి చూపే వలే మృత్యువులా చుట్టుకొని జల సమాధి చేసింది. చేపల వేటే జీవనాధారంగా కుటుంబాన్ని పోషిస్తున్న ఆ మత్స్యకారుడిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.

సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): చేపల వేటకు వల విసురుతున్న మత్స్యకారుడు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన మంగళవారం సింగరాయకొండ మండలం పాకల పంచాయతీలో పోతయ్యగారి పట్టపుపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పోతయ్య గారి పట్టపుపాలేనికి చెందిన వాయిల పోలయ్య(47) మంగళవారం సముద్రంలో చేపలు వేటాడేందుకు వల తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్లాడు. వలను వేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అలల తాకిడికి పోలయ్య వలతో పాటు సముద్రంలో తిరగబడ్డాడు. వల అతనిని చుట్టుకోవటంతో తనను తాను రక్షించుకోలేక నీట మునిగాడు. ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు.

మృతుడికి ఇతనికి భార్య, నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. పేదరికంలో ఉన్న పోలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని మత్యకార నాయకులు కొందరు వైఎస్సార్‌సీపీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మాదాసి వెంకయ్యను వేడుకున్నారు. పోలయ్య కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం వచ్చేందుకు కృషి చేస్తానని వెంకయ్య వారికి హామీ ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పులి రాజేష్‌ తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు