వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

7 Oct, 2018 09:03 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ బాపురెడ్డి

వలిగొండ(భువనగిరి) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సొంత మామనే ప్రియుడు, తమ్ముడితో కలిసి కోడలు హత్య చేయించింది. హత్యలో పాలుపంచుకున్న ముగ్గురు నిందితుల ను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వలి గొండ మండలం నెమిలెకాల్వలో గత నెల 10న జరిగిన గడ్డం ముత్యాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను చౌటుప్పల్‌ ఏసీపీ బాపురెడ్డి వెల్లడించారు. గ్రామానికి చెందిన గడ్డం ముత్యాలు కుమారుడు రమేశ్‌. ఇతని భార్య సంతోష. ఉపాధి హామీ పథకంలో కూలి పనికి వెళ్లేది. ఇదే గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గడ్డం శ్రీమన్నారాయణతో సంతోషకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ విషయాన్ని గమనించిన సంతోష మామ గడ్డం ముత్యాలు కోడలిని మందలించాడు. గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టాడు. సంతోష ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమెను తల్లి గారింటింకి పంపించారు. పోయిన నెలలో గ్రామదేవతల పండగ ఉండడంతో రమేశ్‌ భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న మామను అంతమొందించాలని పథకం వేసింది. గత నెల 10న ముత్యాలు సైకిల్‌పై సాయంత్రం పొలం వద్దకు వెళ్లాడు. ఈ సమాచారాన్ని ప్రియుడు శ్రీమన్నారాయణ, చౌటుప్పల్‌ మండలం లక్కారానికి చెందిన సొంత తమ్ముడు నీల వెంకటేశానికి చేరవేసింది.

వీరిద్దరు కలిసి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి ముత్యాలుపై దాడి చేసి హత్య చేశారు. పొలం వద్దకు వెళ్లి రాత్రి అయిన ముత్యాలు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ పొలం వద్దకు వెళ్లగా విగతజీవిగా కనిపించాడు. ఆ రోజున ముత్యాలు రెండో కుమారుడు శేఖర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ ఇద్రిస్‌అలీ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశాడు. అప్పటి నుంచి పోలీసులు విచారణ ప్రారంభించి కేసును చేధించారు. హత్యకు కారణమైన సంతోషతోపాటు శ్రీమన్నారాయణ, వెంకటేశంలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ ఇద్రిస్‌ అలీ ఉన్నారు. 

మరిన్ని వార్తలు