రొంపిచెర్లలో బాలిక కిడ్నాప్‌

25 Jul, 2019 11:21 IST|Sakshi
బాలికను కిడ్నాప్‌ చేసిన పవన్‌కుమార్‌

సాక్షి, రొంపిచెర్ల(చిత్తూరు) : బాలిక కిడ్నాప్‌కు గురైన ఘటన రొంపిచెర్లలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రసాద్‌ కథనం..మండలంలోని బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ రామచంద్రాపురం కాలనీకి చెందిన బాలిక స్థానికంగా ఒక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రొంపిచెర్ల బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఈ బాలిక ఉండగా చిన్నగొట్టిగల్లుకు చెందిన పవన్‌కుమార్‌(24) మాయమాటలు చెప్పి తన నలుగురు స్నేహితులతో కలసి ఈ నెల 20న కిడ్నాప్‌ చేశాడు.

బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరుకు చెందిన రమ్య(22), గోవిందరాజులు (23), చిన్నగొట్టిగల్లు చెందిన సాయికుమార్‌ (19), చిన్నగొట్టిగల్లు కుమ్మరపల్లెకు చెందిన మునిరత్నం (22)పై కేసు నమోదు చేశారు. వీరిలో గోవిందరాజులు, సాయికుమార్, మునిరత్నం రొంపిచెర్ల క్రాస్‌లో ఉండగా బుధవారం ఉదయం అరెస్టు చేశారు. నిందితులను పీలేరు కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రధాన నిందితుడు పవన్‌కుమార్‌పై నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

డ్యాన్స్‌తో బుట్టలో పడేశాడు!
పవన్‌ కుమార్‌ బెంగళూరులోని ఓ నృత్య శిక్షణ సంస్థలో డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. రొంపిచెర్లలోని ప్రైవేటు స్కూలు నిర్వాహకులు ప్రతి ఏటా నిర్వహించే వార్షికోత్సవంలో అతను మూడేళ్లుగా క్రమం తప్పకుండా తన నృత్యప్రదర్శన ఇస్తున్నట్లు తెలిసింది. అతడి నృత్యానికి ఫిదా అయిన బాలిక అతడితో చేసుకు న్న పరిచయం కిడ్నాప్‌ వరకూ వ్యవహా రం వరకూ నడిచింది.  

ఆ బాలిక కిడ్నాప్‌కు సహకరించిన అతని మిత్రులైన గోవిందరాజులు, రమ్య కూడా బెంగళూరులోనే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు నిందితుల్లో సాయికుమార్‌ ప్రధాన నిందితుడికి తమ్ముడని తెలిసింది. మొత్తానికి కిడ్నాప్‌ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, పోలీసులు వెంటాడుతున్న వైనం..వెరసి సినిమాను తలపిస్తోంది! ప్రధాన నిందితుడు పట్టుబడితే మాత్రం పోలీసులు తమదైన డ్యాన్స్‌ చేయించడం గ్యారంటీ.

బెంగళూరుకు రయ్‌..రయ్‌
బాలిక కిడ్నాప్‌ కేసు ఛేదనకు సంబంధించి స్థానికులందించిన సమాచారం పోలీసులకు ఉపకరించింది. అలాగే, ఇక్కడి నుంచి మోటార్‌ సైకిల్‌పై పీలేరు మీదుగా బెంగళూరుకు బాలికను తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకు పీలేరులోని సీసీ కెమెరాల పుటేజీ కీలకంగా నిలిచింది. కెఏ 05 హెచ్‌టి 5642 బజాజ్‌ పల్సర్‌ బైక్‌లో నిందితుడు బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. అంతేకాకుండా పవన్‌కుమార్‌  సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అతను ఎటు వెళ్తున్నాడో పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బెంగళూరు నుంచి ఆ తర్వాత బస్సులో బాలికను హైదరాబాద్‌కు తీసుకెళ్లిన పవన్‌కుమార్‌ ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు వైపు వెళ్తున్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు