మెరుగుపెడతామంటూ మోసం..

21 Feb, 2019 08:28 IST|Sakshi
బంగారం పోగొట్టుకున్న అత్తా,కోడళ్లు కాంతరత్నం, అనూష

13 తులాల ఆభరణాలతో  పరారైన మోసగాళ్లు..

విజయనగరం, పార్వతీపురం/ గరుగుబిల్లి: బంగారానికి మెరుగు పెడతామని ఇద్దరు మహిళలను నమ్మించి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు 13 తులాల బంగారంతో పరారైన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. పట్టణ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సంకావీ«ధిలో  కోరాడ కోటేశ్వరరావు భార్య అనూష , తల్లి కాంతరత్నం వద్దకు బుధవారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో వచ్చి ఇత్తడి, బంగారం, రాగి వస్తువులకు మెరుగుపెడతామని నమ్మబలికారు. ముందుగా ఇంటిలో ఉన్న ఇత్తడి, రాగి, వస్తువులకు మెరుగు పెట్టారు. దీంతో మహిళలు తమ వలలో పడ్డారని గ్రహించిన వ్యక్తులు కుక్కర్లో నీరు, పిడికెడు పసుపు ఇస్తే బంగారు వస్తువులకు కూడా మెరుగు పెడతామని నమ్మబలికారు.

ఈ మేరకు కాంతరత్నం మూడు తులాల గొలుసు, నాలుగు బంగారు కంకణాలు, అనూష మెడలోని రెండు తులాల పగడాల హారం, నాలుగు గాజులను మెరుగుపెట్టాలని అపరిచితుల చేతులో పెట్టారు. ఇంతలో ఒక వ్యక్తి ఇంటిలో నుంచి బయటకు వచ్చేశాడు. మరో వ్యక్తి బంగారు ఆభరణాలు మెరుగుపెడుతున్నట్లు నటించాడు. ఇంతలో మరింత పసుపు కావాలని అనూష, కాంతరత్నంలను ఒకరి తర్వాత ఒకరిని కోరగా ఇద్దరూ ఇంటిలోకి వెళ్లిపోయారు. ఇదే అదునుగా మోసగాళ్లు అక్కడ నుంచి పరారయ్యారు. మహిళలిద్దరూ బయటకు వచ్చేసరికి కుక్కర్లో బంగారం లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి చుట్టుపక్కల వారికి తెలియజేశారు. అపరిచిత వ్యక్తులు చుట్టుపక్కల కనిపించకపోవడంతో అనూష తన భర్త కోటేశ్వరరావుకు ఫోన్‌ ద్వారా విషయాన్ని తెలియజేసింది. అనంతరం బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో  ఎస్సై యు. మహేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గరుగుబిల్లి మండలంలోని ముగ్గురు వ్యక్తులు బంగారానికి మెరుగు పెడతామంటూ తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిలో ఒకరిని పట్టుకుని గరుగుబిల్లి ఎస్సై సింహాచలంనకు అప్పగించారు.

మరిన్ని వార్తలు