గుడ్డలు కుక్కి... చేతులు విరిచి

11 Feb, 2018 04:25 IST|Sakshi
చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్న సీఐ రమేశ్, అన్నం శ్రీనివాసరావు, అమ్మమ్మ కాశీంబీ

మద్యం మత్తులో పసిబిడ్డపై కర్కశంగా ప్రవర్తించిన అమ్మమ్మ

ఆస్పత్రికి తరలించి అక్కున చేర్చుకున్న ‘అన్నం’

బాలసదన్‌కు తరలించిన ఐసీడీఎస్‌ అధికారులు

ఖమ్మం క్రైం: అనారోగ్యంతో తల్లి చనిపోవటంతో పసిబిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్నారు.. తల్లి లాంటి అమ్మమ్మ వారిని సముదాయించాల్సింది పోయి.. మద్యం మత్తులో వారిని చితకబాదింది. ఏడాదిన్నర బిడ్డ తల్లి కోసం ఏడుస్తుండటంతో ఆ చిన్నారి చేతులను విరిచేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. జిల్లా కేంద్రంలోని త్రీటౌన్‌ ప్రాంతంలోని కాల్వొడ్డుకు చెందిన షేక్‌ సోందు కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.

భార్య సైదాబీ తన ముగ్గురు ఆడపిల్లలు హుస్సేన్‌బీ(6), ఆసియా(3), జైనా(ఏడాదిన్నర), తల్లి కాశీంబీతో కలసి వెంకటగిరి ప్రాంతంలో ప్లాస్టిక్‌ కవర్లతో నివాసం ఏర్పాటు చేసుకొని.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అమ్మమ్మ కాశీంబీ మద్యానికి బానిసైంది. ఈ క్రమంలో సైదాబీ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం మృతి చెందింది. ఈ విషయం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లికోసం ఏడుస్తుండటంతో.. మద్యం మత్తులో ఉన్న అమ్మమ్మ కాశీంబీ వారిని తీవ్రంగా కొట్టింది. భయపడిన చిన్నారి ఆసియా ఏడుపు ఆపింది. మరో చిన్నారి జైనా ఏడుపు ఆపకపోవటంతో  చితక్కొట్టింది.

పక్కనున్న వారి గద్దించడంతో కొట్టడం ఆపేసింది. చుట్టుపక్కల వారు పడుకున్న తర్వాత కాశీంబీ తల్లిపాల కోసం ఏడుస్తున్న జైనా నోట్లో గుడ్డలు కుక్కి.. దారుణంగా చేతులు విరిచేసింది. భయంతో ఆసియా ఓ మూలన నక్కి పడుకుంది. ఉదయం 10 గంటల సమయంలో సైదాబీ మృతదేహం చూసేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు వేలాడుతున్న చిన్నారి చేతులను చూసి కాశీంబీని గద్దించారు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా.. ఆశియా తన చెల్లెలిని రాత్రి నుంచి కొడుతూనే ఉందని చెప్పింది.

స్థానికులు స్వచ్ఛంద సంస్థ అన్నం ఫౌండేషన్‌కు ఫోన్‌ చేయడంతో  ఆ సంస్థ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావుతో పాటుగా వన్‌టౌన్‌ సీఐ రమేశ్‌ వచ్చి చిన్నారిని  ఆస్పత్రికి తరలించారు. చింతకాని హాస్టల్‌లో ఉంటోన్న పెద్ద కుమార్తె హుస్సేన్‌బీని తీసుకొచ్చి గంజేషాహిద్‌ మసీద్‌ కమిటీ వారు సైదాబీకి అంత్యక్రియలు నిర్వహించారు. జైనా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, హుస్సేన్‌బీ.. ఆసియాలను అన్నం ఫౌండేషన్‌ చేరదీసింది. వారు ఐసీడీఎస్‌ అధికారులతో మాట్లాడి.. ఆ చిన్నారులను బాలసదన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మమ్మ కాశీంబీ పారిపోయింది.

మరిన్ని వార్తలు