జైలులో రాజభోగం

27 Feb, 2020 13:14 IST|Sakshi

గ్లెన్‌ బ్రిగ్స్‌ లీలలు  ఇన్నిన్ని కాదయా..!

పోలీసులతో దోస్తీ.. జైలు సిబ్బందితో చనువు జాస్తి

జైలులో ఉన్నా ఆదివారం పొట్టేళ్లు తెగాల్సిందే

మందు, విందులతో కారాగారంలోనూ జల్సా

జైళ్లశాఖ డీఐజీ తనిఖీల్లో వెలుగుచూస్తున్న వాస్తవాలు

గ్లెన్‌ బ్రిగ్స్‌... ఈ కాలపు చార్లెస్‌ శోభరాజ్‌. రాష్ట్రంలో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల సృష్టికర్త. బ్రిగ్స్‌కు పోలీసులంటే లెక్కేలేదు. జైలంటే భయం లేదు. కేసులపై ఆందోళన లేదు. గుత్తి, గుంతకల్లు, తిరుపతి కేంద్రాలుగా వేల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి దేశవ్యాప్తంగా విక్రయించాడు. పోలీసులతో ఉన్న పరిచయాలతో జైలుకు వెళ్లినా రాజభోగాలు అనుభవించాడు. ఖాకీల నుంచి అందిన సహకారం.. జైలులో బ్రిగ్స్‌ దర్జా చూసి ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు.

 

అనంతపురం, గుంతకల్లు: నకిలీ సర్టిఫికెట్ల కేసుల్లో నిందితుడు గ్లెన్‌ బ్రిగ్స్‌ నేరచరిత్ర.. విలాసాలు.. జైలులో గడుపుతున్న రాజభోగాలు తెలిసి అధికారులే అవాక్కవుతున్నారు. ఇటీవల అరెస్టయి ప్రస్తుతం గుత్తి సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా బ్రిగ్స్‌ బయటి ప్రపంచంతో నిత్యం టచ్‌లో ఉంటున్నాడు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు గ్లెన్‌ బ్రిగ్స్‌ నేర చరిత్రను లోతుగా తవ్వడంతో నమ్మలేని ఎన్నో నిజాలు వెల్లడయ్యాయి. దీంతో ఎస్పీ సత్యయేసుబాబు ఆధారాలతో సహా జైలు శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో బుధవారం జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్‌ గుత్తి సబ్‌జైలును తనిఖీ చేశారు. బ్రిగ్స్‌తో జైలు సిబ్బందికి ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ చేపట్టారు. గ్లెన్‌ బ్రిగ్స్‌తో జైలు సిబ్బంది ములాఖత్‌ అవుతున్న వైనం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు సబ్‌జైలు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

జైలుకు వెళ్తే రాజభోగమే..
గ్లెన్‌ బ్రిగ్స్‌ జైలుకు వస్తున్నాడంటే గుత్తి సబ్‌జైలు అధికారులు, సిబ్బందికి పండుగే. ఈ నకిలీ సర్టిఫికెట్ల కేటుగాడికి విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సబ్‌జైలు సిబ్బంది అందరూ ఉత్సాహంతో పనిచేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక గది, ఫ్యాన్, పరుపు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసేవారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తన అనుచరులతో మాట్లాడుకోవడానికి ఫోన్‌ కూడా ఇచ్చేవారు. ఖరీదైన మద్యం, మంచి విందు భోజనం నేరుగా అతని గదికే సరఫరా అయ్యేది. అప్పుడప్పుడు రహస్యంగా జైలు నుంచి బయటికి తీసుకువెళ్లి ఆయన పనులు పూర్తి చేయించుకునే వీలు కల్పించేవారని సమాచారం. ఇందుకోసం బ్రిగ్స్‌ జైలు సిబ్బందికి భారీగా ముట్టజెప్పేవాడు. ఇక ఆదివారం వచ్చిందంటే జైల్లోనే పొట్టేళ్లు కోయించి జైలు సిబ్బందికి జైలు కిచెన్‌లోనే వండించే వారని తెలుస్తోంది. జైలు సిబ్బందికే కాదు ఆ సమయంలో జైలులో ఉన్న రిమాండ్‌ ఖైదీలకు సైతం మటన్‌ బిర్యానీ అందేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎందరో ఖైదీలు గ్లెన్‌ బ్రిగ్స్‌కు అభిమానులుగా, అనుచరులుగా మారారు. ఇలా మారిన వారే ఆ తర్వాత నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌లో కీలకంగా వ్యవహరించారు. మొత్తంగా గుత్తి సబ్‌జైలు ఒక పెద్ద మోసగాడికి అన్ని సౌకర్యాలు కల్పించిన వైనంపై అధికారులను విస్మయపరిచింది.

పోలీసు అండదండలతోనే..
పోలీసు అధికారుల అండదండలతోనే గ్లెన్‌ బ్రిగ్స్‌ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నట్లు తెలుస్తోంది. ఖాకీల అండతోనే రెండు దశాబ్దాలుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ కరెన్సీ సృష్టించి చెలామణి చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 2006, 2007, 2008లలో గ్లెన్‌బ్రిగ్స్‌ నకిలీ సర్టిఫికెట్లు తయారీ కేసుల్లో అరెస్టయ్యాడు. అప్పటి జిల్లా ఎస్పీ స్టీఫెన్‌ రవీంద్ర అతనిపై జిల్లా బహిష్కరణ వేటు వేశారు. దీంతో తన మకాంను గుంతకల్లు నుంచి తిరుపతికి మార్చాడు. తిరుపతిలో సురేష్‌రెడ్డిగా పేరు మార్చుకొని మళ్లీ తన రాకెట్‌ సాగించారు. బ్రిక్స్‌పై 18కిపైగా కేసులున్నప్పటికీ జైలుకు వెళ్లడం...రిలీజ్‌ అయ్యాక మళ్లీ తన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించడం పరిపాటిగా మారింది. పోలీసు శాఖలోని  కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు గ్లెయిన్‌బ్రిక్స్‌ లంచాలకు దాసోహం కావడం వల్లే అతను విచ్చలవిడిగా రెచ్చిపోయేందుకు కారణమైనట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు