పదే పదే అవే తప్పులు: కెప్టెన్‌

27 Feb, 2020 13:21 IST|Sakshi

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో అందరి కంటే ముందుగా సెమీస్‌ చేరడంపై భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తాము సాధారణ స్కోర్లే చేస్తున్నా దాన్ని కాపాడుకుని వరుస విజయాలు సాధించడం ఒకటైతే, సెమీస్‌కు చేరడం​ ఇంకా కొత్త అనుభూతిని తీసుకొచ్చిందన్నారు. కాకపోతే ముందుగా బ్యాటింగ్‌ చేసే క్రమంలో తొలి 10 ఓవర్ల పాటు తమ స్కోరు బాగానే ఉంటున్నా, దాన్ని కడవరకూ కొనసాగించకపోవడం నిరాశను మిగులుస్తుందన్నారు. తాము పదే పదే ఒకే తరహా తప్పులు చేయడంతో వికెట్లను చేజార్చుకుంటున్నామన్నారు. తనతో పాటు టాపార్డర్‌లో పలువురు విఫలం కావడంతో భారీ స్కోర్లను చేయలేకపోతున్నామని హర్మన్‌ ప్రీత్‌ అన్నారు. రాబోవు టోర్నీలో గాడిలో పడతామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా తమ బౌలింగ్‌ మెరుగ్గా ఉండటంతోనే స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లను కాపాడుకుంటున్నామన్నారు.(ఇక్కడ చదవండి: హ్యాట్రిక్‌ విజయంతో సెమీస్‌లోకి..)

ఇక న్యూజిలాండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సోఫీ డివైన్‌ మాట్లాడుతూ.. ‘ మేము చాలా బాగా ఆడాం. భారత్‌ను 133 పరుగులకే కట్టడి చేయడం నిజంగా గొప్ప విషయం. షెఫాలీ వర్మ ధాటిగా బ్యాటింగ్‌ చేసినా మిగతా వారిని కట్టడి చేసి సాధారణ స్కోరుకే పరిమితం చేశాం. కానీ ఇంకా ఇక్కడ పరిస్థితులకు అలవాట పడలేదు. బంతి నుంచి మరింత పేస్‌ మరింత బౌన్స్‌ వస్తుందని అనుకుంటే అలా జరగలేదు. మేము లైన్‌ లెంగ్త్‌పైన ఆధారపడి బౌలింగ్‌ చేశాం. మేము కడవరకూ వచ్చి ఓడిపోవడంతో పెద్దగా బాధనిపించలేదు. ఈ మ్యాచ్‌ ద్వారా మేము అనేక పాఠాలు నేర్చుకున్నాం’ అని ఆమె అన్నారు. (ఇక్కడ చదవండి: నైట్‌ సెంచరీ: ఇంగ్లండ్‌ భారీ విజయం)

మరిన్ని వార్తలు