ఔషధ బాధితుడు మాయం

6 Dec, 2017 03:14 IST|Sakshi

 వరంగల్‌ ఎంజీఎంలో ఘటన 

విచారణ రోజు హైడ్రామా

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: క్లినికల్‌ ప్రయోగాల కేసు కొత్త మలుపు తీసుకుంది. ఔషధాల ప్రయోగం వికటించి వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. అయితే, బాధితుడు స్వచ్ఛందంగా వెళ్లిపోయాడా.. లేదా ఎవరైనా తప్పించారా... అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఔషధ ప్రయోగ బాధితుడు బోగ సురేశ్‌ రక్తపు వాంతులు చేసుకోవడంతో అతడిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి ఆదివారం తీసుకువచ్చారు. అయితే, ఈ కేసు విచారణ నిమిత్తం సెంట్రల్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు ఎంజీఎంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 7 గంటలకే సురేశ్‌ ఎంజీఎం నుంచి వెళ్లిపోయాడు. 

ఐదుగురు అపరిచితులు
విచారణ రోజే బాధితుడు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. విచారణ నుంచి తమను కాపాడుకునేందుకు ఫార్మా కంపెనీలు ఏమైనా పన్నాగం పన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళ వారం ఉదయం 6 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు సురేశ్‌తో మాట్లాడేందుకు వార్డుకు వచ్చారు. పదిహేను నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత అందరూ కలసి వెళ్లిపోయారు. ఎంతకీ తిరిగి రాకపో వటంతో వైద్య సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందిం చారు. సురేశ్‌ను కలిసిన ఐదుగురు వ్యక్తులు ఎవరనేది మిస్టరీగా మారింది.

మరిన్ని వార్తలు