‘ఈ–టికెట్‌’ స్కాం బట్టబయలు

22 Jan, 2020 01:53 IST|Sakshi

పలు దర్యాప్తు సంస్థల భాగస్వామ్యంతో ఛేదించిన ఆర్‌పీఎఫ్‌

కీలక వ్యక్తి సహా 28 మంది అరెస్టు

మనీల్యాండరింగ్, ఉగ్రసంస్థలతో సంబంధాలు

న్యూఢిల్లీ: రైల్వేలో భారీ ఈ –టికెట్‌ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణం సూత్రధారులకు మనీ ల్యాండరింగ్, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు దీన్ని ఛేదించిన రైల్వే భద్రతా దళం (ఆర్‌పీఎఫ్‌) డీజీ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం ఇక్కడ మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. ‘దొడ్డిదారిన ఈ టికెట్ల విక్రయం జరుగుతున్నట్లుగా అనుమానం రావడంతో గత ఏడాది ‘ఆపరేషన్‌ థండర్‌స్టార్మ్‌’పేరుతో దర్యాప్తు ప్రారంభించాం. ఈ సందర్భంగా గులాం ముస్తాఫా(28) పేరు బయటకు వచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ఇతడు 2015 నుంచి ఈ దందా నడుపుతున్నాడు.

ఈ నెల మొదటి వారంలో ఇతడిని భువనేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్నాం. ఇతని వద్ద ఐఆర్‌సీటీసీకి చెందిన 563 మంది గుర్తింపుకార్డులు లభించాయి. వీటి ద్వారా ఇతడు టికెట్లను బుక్‌ చేసేవాడు. వచ్చిన డబ్బును  బ్యాంకు అకౌంట్లకు మళ్లించేవాడు. ఇందుకు సంబంధించి ఇతని వద్ద 3,000 అకౌంట్ల వివరాలు లభించాయి. దీంతోపాటు ఇతని వద్ద రెండు ల్యాప్‌టాప్‌లలో ఏఎన్‌ఎంఎస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉంది. దీంతో సాధారణ యూజర్ల కంటే వేగంగా టికెట్లను బుక్‌ చేయవచ్చు. వచ్చిన డబ్బును డార్క్‌నెట్‌ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి మారుస్తాడు. ఆ కరెన్సీని మనీ ల్యాండరింగ్‌కు, ఉగ్రసంస్థలకు సాయం అందించేందుకు వాడుతున్నట్లు మా అనుమానం’ అని డీజీ వెల్లడించారు. ‘పాక్‌కు చెందిన తబ్లిక్‌–ఇ–జమాత్‌ అనే ఉగ్రసంస్థతోనూ, బంగ్లాదేశ్, ఇండోనేసియా, నేపాల్, ఇంకా గల్ఫ్‌ దేశాల వారితో ఇతనికి సంబంధాలున్నట్లు ల్యాప్‌టాప్‌ల్లో సమాచారంతో తేలింది. అతని వద్ద నకిలీ పాన్, ఆధార్‌ కార్డులను తయారు చేసే సాఫ్ట్‌వేర్‌ కూడా ఉంది.  

ఇతని గ్రూప్‌ నుంచి డబ్బు అందుకునే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మనీల్యాండరింగ్‌ కు పాల్పడుతోంది. దీనిపై సింగపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’అని డీజీ అరుణ్‌ కుమార్‌ చెప్పారు. ‘గురూజీ అనే పేరుగల సాంకేతిక నిపుణుడికి ముస్తాఫా ఇటీవల రూ.13 లక్షలు అందించాడు. తన గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు ఈ గురూజీ యుగోస్లావియా వీపీఎన్‌ వాడుతున్నాడు. ఈ ముఠా నడిపే అవయవ వ్యాపారం దందాలో భాగంగా వివిధ ఆస్పత్రులకు గురూజీ చికిత్సల పేరుతో బంగ్లాదేశ్‌ వాసులను పంపిస్తున్నాడు. ఈ రాకెట్‌ ద్వారా నెలకు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఆర్జిస్తున్నట్లు అనుమానిస్తున్నాం’అని వివరించారు.

దుబాయ్‌లో సూత్రధారి
ఈ టికెట్‌ రాకెట్‌కు మాస్టర్‌మైండ్‌  హమీద్‌ అష్రాఫ్‌. 2019 జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని ఓ స్కూల్‌ ఆవరణలో బాంబు పేలుడుకు ఇతడే సూత్రధారి. ఈ ఘటనలో అరెస్టయిన ఇతడు బెయిల్‌పై బయటకు వచ్చి, నేపాల్‌ మీదుగా దుబాయ్‌కి పరారయ్యాడు. పది రోజులుగా ఇంటలి జెన్స్‌ బ్యూరో, స్పెషల్‌ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), కర్ణాటక పోలీసులు ముస్తాఫాను విచారణ చేస్తున్నారు. ముస్తాఫా ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటివరకు 27 మందిని అరెస్టు చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా