Sakshi News home page

బాబూ! ఆ డబ్బెక్కడిది?

Published Sat, Sep 2 2023 3:30 AM

Chandrababu Naidu Looted Crores Of Money In Capital Constructions - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించింది. ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4వ తేదీన ఈ నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ జాతీయ ఇంగ్లిష్‌ దినపత్రిక ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ శుక్రవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఆగస్టు 4న చంద్రబాబుకు జారీ చేసిన ఈ షోకాజ్‌ నోటీసులపై ఆ పత్రిక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక ప్రచురించిన కథనం మేరకు వివరాలివీ... 

మనోజ్‌ వాసుదేవ్‌ సోదాల్లో విషయం వెలుగులోకి... 
మనోజ్‌ వాసుదేవ్‌పార్థసాని 2017 నుంచీ షాపూర్జీ పల్లోంజీ సంస్థ పాల్గొనే టెండర్ల ప్రక్రియలో చురుగ్గా ఉంటున్నారు. ఆ సంస్థ తరఫున ఈయనే మధ్యవర్తిగా వ్యవహారాలు నడిపేవారు. ఈయనకు చెందిన మనోజ్‌ పార్థసాని అసోసియేట్స్‌ కార్యాలయంలో 2019లో ఐటీ శాఖ అధికారులు జరిపిన సోదాలతో చంద్రబాబు నాయుడు గుట్టుగా సాగించిన అవినీతి బయటపడింది. 

బోగస్‌ కాంట్రాక్టులు, వర్క్‌ ఆర్డర్ల పేరుతో షాపూర్జీ పల్లోంజీ నుంచి భారీ ఎత్తున నగదును తరలించినట్లు మనోజ్‌ వాసుదేవ్‌ అంగీకరించారని కూడా గతంలో ఐటీశాఖ తన నివేదికలో వెల్లడించింది. సోదాల సమయంలో కొన్ని మెసేజ్‌లు, వాట్సాప్‌ చాటింగ్స్, ఎక్సెల్‌ షీట్లను మనోజ్‌ వాసుదేవ్‌ నుంచి స్వాధీనం చేసుకున్నామని, అందులో కొన్ని ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీల నుంచి నగదును అక్రమంగా తరలించి ‘మీకు చేరుస్తున్నాం’ అని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నట్లు ఐటీ శాఖ వివరించింది. 

ఆ నోటీసుల ప్రకారం మనోజ్‌ పార్థసాని చంద్రబాబు నాయుడుకి చెందిన వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్‌తో 2016 నుంచీ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని శ్రీనివాస్‌ తనను అడిగినట్లు కూడా మనోజ్‌ వాసుదేవ్‌ అప్పట్లో వెల్లడించారని ఐటీ పేర్కొంది. అయితే షాపుర్జీ పల్లోంజీ సంస్థ బడా కార్పొరేట్‌ కంపెనీ కనక... డబ్బును తరలించడానికి వారంతా కలిసి ఓ తెలివైన మార్గాన్ని ఎంచుకున్నారు. 

వాస్తవంగా ఎటువంటి పనులు చేయకుండానే షాపూర్జీ పల్లోంజీ నుంచి వివిధ ప్రాజెక్టులు చేసినట్లుగా షెల్‌ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులు పెట్టి ఆయా కంపెనీలకు నగదును తరలించారు. ఈ విషయాన్ని 2019 నవంబరు 1న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా మనోజ్‌ పార్థసాని తెలియజేశారు. కేవలం షాపుర్జీ పల్లోంజీయే కాకుండా ఎల్‌అండ్‌టీ వంటి ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి ఫోనిక్స్‌ ఇన్‌ఫ్రా, పోర్‌ ట్రేడింగ్‌ వంటి షెల్‌ కంపెనీలకు నకిలీ బిల్లుల ఆధారంగా నగదును తరలించినట్లు ఐటీ శాఖకు అర్థమయింది. 

ఈ విషయాలన్నీ వివరిస్తూ ఆ డబ్బుకు లెక్కలు చెప్పాలని, అవి ఎలా వచ్చాయో తెలియజేయాలని బాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చింది. శ్రీనివాస్‌ నుంచి చంద్రబాబు నాయుడుకు నగదు చేరినట్లుగా ధ్రువీకరించే ఆధారాలను, నేరాన్ని ధ్రువపరిచే వివిధ సందేశాలు, చాట్‌లు, ఇంకా ఎక్సెల్‌ షీట్‌లను సైతం సెర్చ్‌ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నట్లు డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. 

ఈ సాక్ష్యాలను మనోజ్‌ వాసుదేవ్‌కు చూపించి విచారించగా ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా నగదును ఎలా తరలించారన్న విధానాన్ని మొత్తం వివరించినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ బోగస్‌ కంపెనీల ద్వారా తరలించిన నగదు ద్వారా అంతిమంగా లబ్థి పొందింది చంద్రబాబేనని ఐటీ శాఖ పేర్కొంది. 

మనోజ్‌ వాసుదేవ్‌ ద్వారా సబ్‌కాంట్రాక్టుల ద్వారా అందుకున్న రూ.118,98,13,207 మొత్తాన్ని 2020–21లో వచ్చిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది. 

అమిత్‌ షాను బాబు కలవటంపై అనుమానాలు!! 
2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరినీ ప్రాధేయపడుతూ నానా తంటాలూ పడుతున్న వేళ ఈ నోటీసులు రావటంపై ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ పత్రిక అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్‌లో చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం కావటాన్ని కూడా హిందుస్థాన్‌ టైమ్స్‌ పత్రిక ప్రస్తావించింది. 

ఈ నోటీసుల విషయమై తాము అటు చంద్రబాబు నాయుడిని, ఇటు కేంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖలను ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించామని, ఎవ్వరూ స్పందించలేదని కూడా పత్రిక వెల్లడించింది.  

లెక్క తేలని మొత్తం రూ.2,000 కోట్లు 
అమరావతిలో రాజధాని పేరిట తాత్కాలిక భవనాలను నిర్మించిన చంద్రబాబు... అందులో భారీ కుంభకోణానికి తెగబడినట్లు తాజా ఐటీ నోటీసులతో మరోసారి బట్టబయలైంది. తాత్కాలిక నిర్మాణాల పేరుతో పనుల అంచనా విలువలను భారీగా పెంచేసి అడ్డగోలుగా దోపిడీ చేసిన వైనాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. 

తాత్కాలిక సచివాలయాన్ని రూ.181 కోట్లతో పూర్తి చేయాలని తొలుత అంచనా వేసుకుంటే దాన్ని పెంచుకుంటూ రూ.1,151 కోట్లు ఖర్చు చేశారంటే... అంచనాలు ఎన్ని రెట్లు పెంచారో,  అడ్డగోలు దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో తేలిగ్గానే అర్థమవుతుంది. 2020, ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.2,000 కోట్ల వరకు లెక్క చూపని ఆదాయానికి సంబంధించిన లావాదేవీలు బయటకు తీసిన విషయాన్ని ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులతో సహా అప్పట్లోనే ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. 

ఒకే కంప్యూటర్‌ నుంచి ఆయా సంస్థలకు చెందిన బిల్లుల చెల్లింపులు, ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. చంద్రబాబు కొండంత అవినీతి చేస్తే మచ్చుకు రూ.2,000 కోట్లు మాత్రమే బయటకు వచ్చాయని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని భారీ మొత్తాలు వెలుగులోకి వస్తాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

అడ్డగోలు వాదన... బాబుకు అలవాటే!! 
చంద్రబాబు నాయుడికైనా, రామోజీరావుకైనా అడ్డంగా వాదించటం పెన్నుతో పెట్టిన విద్య. ఎందుకంటే వీళ్లను ఎవరైనా ‘మీరు ఈ నేరం చేశారా?’ అని అడిగితే... తాము చేస్తే చేశామనో, లేకపోతే చేయలేదనో వీళ్లు నేరుగా చెప్పరు. చేసిన నేరాన్ని తప్పించుకోవటానికి ముందుగా ఎదుటి వ్యక్తికి తమను అడిగే అర్హత లేదనో, లేకపోతే తమకు ఆ చట్టం వర్తించదనో, లేకపోతే ఫలానా చట్టం ప్రకారం తమను ప్రశ్నించజాలరనో ఎదురు తిరుగుతారు. 

అలా... కేసును దశాబ్దాల పాటు సాగదీస్తారు. పైపెచ్చు తమపై ఎలాంటి కేసులూ రుజువు కాలేదని, తాము శుద్ధపూసలమని చెబుతుంటారు. అసలు విచారణ జరగనిస్తే కదా... వీళ్లు తప్పు చేశారో లేదో తేలటానికి!!. ఇదే రీతిలో ఐటీ శాఖ నోటీసులకు కూడా చంద్రబాబు నాయుడు విచిత్రమైన సమాధానమిచ్చారు. సోదాల్లో చంద్రబాబు నాయుడి పాత్రను బయటపెట్టే ఆధారాలు లభించటంతో... నేరుగా ఆయన ఖాతాల్లోకి ఎంత ముడుపులు వెళ్లాయనే విషయమై ఒక అంచనాకు వచ్చి... అది ఎలా వచ్చిందో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. 

చంద్రబాబు దానికి నేరుగా సమాధానమివ్వకుండా... తనకు నోటీసులిచ్చే అధికారం సదరు సెంట్రల్‌ సర్కిల్‌ అధికారికి లేదంటూ జవాబిచ్చారు. దాన్ని పరిశీలించిన ఐటీ శాఖ... సెక్షన్లను ఉటంకిస్తూ సదరు కేసును ఆ అధికార పరిధి ఉన్న డిప్యూటీ కమిషనర్‌కు బదిలీ చేస్తూ... డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. దీన్ని అక్రమ ఆదాయంగా పేర్కొంటూ చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆగస్టు 4న జారీ చేసిన నోటీసుల్లో ప్రశి్నంచింది.   

ఇది కూడా చదవండి: ప్రభుత్వ చర్యలు భేష్‌.. సీఎం జగన్‌కు యూనిసెఫ్‌ టీమ్‌ అభినందన

Advertisement

What’s your opinion

Advertisement