వలలోకి దించుతాయ్‌.. ఈ వెబ్‌సైట్లతో జాగ్రత్త!!

29 Oct, 2019 06:37 IST|Sakshi
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూపుతున్న సైబర్‌ క్రైం సీఐ గోపీనాథ్‌ 

విశాఖ పోలీసుల చొరవతోనే వెలుగు చూసిన వాస్తవాలు

సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): తియ్యటి మాటలతో యువకులను వలలో వేసుకుంటున్న వెబ్‌సైట్‌ నిర్వాహకులు కోలకతాలో కుప్పలు తెప్పలుగా ఉన్నారని సైబర్‌ క్రైం సీఐ వి.గోపీనాథ్‌ తెలిపారు. శనివారం ఆయన కోల్‌కతాలో ఒక కాల్‌సెంటర్‌పై దాడి చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి సోమవారం నగరానికి చేరుకున్న సీఐ వి. గోపీనాథ్‌  సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపం అనే వ్యక్తి ఈ తరహా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న వీటిపై కోల్‌కతా పోలీసులకు అవగాహన లేదన్నారు. విశాఖ పోలీసుల చొరవతోనే  వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఆరు నెలల క్రితం బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న తాము గతంలో రెండుసార్లు కోల్‌కతా వెళ్లి ప్రయత్నించినా ఆచూకీ తెలియరాలేదన్నారు.

స్వాధీనం చేసుకున్న సిమ్‌కార్డులు, గుర్తింపుకార్డులు

మూడవసారి పకడ్బందీగా ప్రయత్నం చేయటంతో గుర్తించగలిగామని సీఐ గోపీనాథ్‌ వివరించారు. ఇందులో యువతులను కాల్‌సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమించుకుంటున్నారని, తరువాత వారిని తమకు అనుకూలంగా  మార్చి ఈ తరహా మోసాలకు గురి చేస్తున్నారని, అందుకు  టార్గెట్లు, కమిషన్‌లు, బహుమతులు ఎరచూపి యువతులను వాడుకుంటున్నారని ఆయన తెలిపారు. కాల్‌సెంటర్‌పై దాడి చేసి నప్పుడు 23 మంది యువతులతో పాటు, ఒక హెచ్‌ఆర్, ఆఫీస్‌ బాయ్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని అలిపూర్‌లో ని అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచామని తెలిపారు. వారి దగ్గర నుంచి 40 వరకు బేసిక్‌ ఫోన్లు, 5 ఆండ్రాయిడ్‌ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, రూటర్, హార్డ్‌ డిస్కు, కొన్ని సిమ్‌లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులు డిసెంబర్‌ 6న నగరంలోని చీఫ్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు. 

వెబ్‌సైట్లతో జాగ్రత్త..
ఇంటర్‌నెట్‌లో పలు వెబ్‌సైట్లు హల్‌చల్‌ చేస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా పీపుల్‌ ఫ్రెండ్స్, కిన్‌ కీ, హానీ పికప్, ఫ్యాషన్, హాట్‌ టెంప్‌టేషన్‌ వంటి వెబ్‌సైట్లు ఉన్నాయన్నారు. చాలా వరకు తాము చేసిన దాడులతో వాటిని నియంత్రించగలిగామని తెలిపారు. ముఖ్యంగా వీరి వలలో నగరానికి చెందిన  కొన్ని విభాగాల్లో ఉన్నతాధికారులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన వివరించారు. యువత, ఉత్సాహవంతులు ఇలాంటి వెబ్‌సైట్ల జోలికి వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. తేనెలా మాట్లాడుతూ నెమ్మదిగా తమ వలలోకి దించి వారి నుంచి లక్షల్లో డబ్బులు కాజేయటమే వారి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు