నాన్నా.. సూసైడ్‌ చేసుకుంటున్నా..

28 Jan, 2020 07:52 IST|Sakshi

తండ్రికి తనయుడి ఫోన్‌

పోలీసుల అప్రమత్తతతో తప్పిన ముప్పు

వెల్దుర్తి(తూప్రాన్‌): మంచిగా చదువుకొమ్మని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఫోన్‌లో తండ్రికి తెలుపగా తండ్రి సమాచారం మేరకు సకాలంలో స్పందించిన పోలీసులు విద్యార్థి ఆచూకీ కనుగొనడంతో ప్రాణాపాయం తప్పింది. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుకునూర్‌ గ్రామానికి చెందిన ఎరుకల నాగరాజు (17)ను మంచిగా చదువుకోవాలని అతని తండ్రి మందలించాడు. దీంతో నాగరాజు కోపంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లి విషం సేవించాడు.

అనంతరం తాను చనిపోతున్నానంటూ తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. తండ్రి పోలీసులకు సమాచారమివ్వగా అప్రమత్తమైన పోలీసులు ఐటీ విభాగం సహాయంతో విద్యార్థి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా అతడు వెల్దుర్తి గ్రామ శివారులోని హల్దీవాగు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ పడి ఉన్న నాగరాజును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తమ పిల్లాడి ప్రాణాలు కాపాడిన పోలీసులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు