పాపను చంపిన బాబాయికి యావజ్జీవం

18 Oct, 2017 12:11 IST|Sakshi
కుందా ఆరాధ్య (ఫైల్‌)

సంచలన తీర్పునిచ్చిన ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ఒంగోలు క్రైం: అభం శుభం తెలియని సంవత్సరం ఏడు నెలల పాప కుందా ఆరాధ్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన నేరస్తుడికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని మంగళవారం యావజ్జీవ శిక్ష విధించారు. స్థానిక జిల్లా కోర్టు భవనాల ప్రాంగణంలోని జిల్లా న్యాయమూర్తి కోర్టులో ఈ సంచలన తీర్పును వెలువరించారు. ఒంగోలు నగరంలోని రాజాపానగల్‌రోడ్డులో నివాసం ఉంటున్న కుందా శ్రీధర్, సాహితీల కుమార్తె ఆరాధ్యను అత్యంత కిరాతకంగా సొంత బాబాయే హత్య చేశాడు. లోకమంటే కూడా తెలియని ఆ పాప ఆరాధ్య ఉసురు నిలువునా తీశాడు. ఆరాధ్య హత్య 2014 నవంబర్‌ 25న ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం పొలాల్లో జరిగింది. కేసును పూర్తి స్థాయిలో విచారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని నేరస్తుడైన కొండ్రు లక్ష్మినారాయణకు యావజ్జీవ కారగార శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా కూడా విధించారు. అప్పట్లో జిల్లాలోని ఈ ముక్కుపచ్చలారని కుందా ఆరాధ్య హత్య ఉదంతం పెను సంచలనం రేపింది. అప్పట్లో ఒంగోలు వన్‌టౌన్‌ íసీఐ బి.రవిచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలలోకెళితే... రాజాపానగల్‌రోడ్డులో నివాసం ఉంటున్న వడ్డెబోయిన నాగేంద్రరావు పెద్ద కుమార్తె సాహితీ. ఆమెను శ్రీధర్‌కిచ్చి వివాహం చేశారు.

ఈ దంపతులకు ఆరాధ్య గారాలపట్టీ. అయితే సాహితీ సోదరి విశ్వాస్‌ సింధూజ ఉంది. సింధూజను టంగుటూరు మండలం పొందూరుకు చెందిన కొండ్రు లక్ష్మినారాయణకిచ్చి వివాహం చేశారు. ఈ నూతన దంపతులు కూడా రాజాపానగల్‌రోడ్డులోని మామ వడ్డెబోయిన నాగేంద్రరావు ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అయితే అక్క కూతురు అయిన ఆరాధ్యతో పిన్ని సింధూజ అత్యంత ప్రేమగా ఉండేది. రోజులో ఎక్కువ సమయం ముద్దు ముద్దుగా ఉన్న ఆరాధ్యతో గడుపుతూ ఉండేది. దీంతో తమ దాంపత్య ఏకాంతానికి భంగం వాటిల్లితుందని సింధూజ భర్త కొండ్రు లక్ష్మినారాయణ భావిస్తుండేవాడు. అది కాస్త ఆ ముక్కుపచ్చలారని ఆరాధ్యపై అసూయ, ద్వేషాలను లోలోపల పెంచుకుంటూ వచ్చాడు. అది కాస్త పాపను హతమార్చే స్థాయికి  వచ్చి   2014 నవంబర్‌ 25న మిట్టమధ్యాహ్నం అమలు చేశాడు. తన ద్విచక్రవాహనంపై ఆరాధ్యను ఆడించుకుంటూ బజారుకు తీసుకెళ్ళాడు. అక్కడ నుంచి నేరుగా సర్వేరెడ్డిపాలెం పొలాల్లోకి తీసుకెళ్ళి పాప గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పెట్రోలుపోసి తగులబెట్టాడు.

అనంతరం ఏమి ఎరగనట్లు ఇంటికొచ్చేశాడు. పాప కనపడటం లేదని లక్ష్మినారాయణ భార్య సింధూజతో పాటు పాప తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులందరూ వెతకడం ప్రారంభించారు. తీరా ఆరాధ్యను బండి మీద తీసుకెళ్ళడానికి గమనించిన వారు  పోలీసులకు అందజేశారు.  పాప కనిపించటం లేదని పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటానికి పోలీస్‌స్టేషన్‌కు వస్తే వాళ్ళతో పాటు హంతకుడు కూడా కలిసి వచ్చాడు. తీరా సమాచారం తెలుసుకున్న పోలీసులు లక్ష్మీనారాయణను అదుపులోనికి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో పోలీస్‌ అధికారులు పాపను హత్య చేసి తగులబెట్టిన ప్రాంతానికి నిందితునితో సహా అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆరాధ్య మృతదేహమేనని గుర్తించారు. ఆ తర్వాత కేసు విచారణ జిల్లా కోర్టులో కొనసాగింది. ఆ తర్వాత జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని నేరస్తుడికి యావజ్జీవ కారగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.శివరామకృష్ణ ప్రసాద్‌ వాధించారు.

మరిన్ని వార్తలు