ఆస్తి కోసమే అంతమొందించారు

23 Jul, 2018 12:20 IST|Sakshi
చౌటుప్పల్‌ : వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రామచంద్రారెడ్డి

చౌటుప్పల్‌(మునుగోడు) : మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. ఆస్తి కోసం అయిన వారినే అంతమొందిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ మారు తల్లి కొడుకును దారుణంగా హత్య చేయించింది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ శివారులో మే 31న జరిగిన ఈ హత్య కేసు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి ఆదివారం చౌటుప్పల్‌ ఏసీపీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌కు చెందిన పంచాల్‌ శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మొదటి భార్య మృతిచెందడంతో జగదేవి అలియాస్‌ ప్రమీలను రెండో వివాహం చేసుకున్నాడు.

రెండో భార్యకు కుమార్తె నవీన, కుమారుడు ప్రచీన్‌లు ఉన్నారు. మొదటి భార్య సంతానంలో ఇద్దరు కుమార్తెల వి వాహాలు జరగగా, కుమారుడు సచిన్‌(28) ఉన్నా డు. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం శ్రీనివాస్‌ మృతి చెందాడు. కుటుంబ పోషణ భారం జగదేవితో పాటు సచిన్‌పై పడింది. ఇదేసమయంలో అదే గ్రామానికి చెందిన మహ్మద్‌ గౌసొద్దీన్‌ అలియాస్‌ గౌస్‌(23) జగదేవి కుమార్తె నవీనను ప్రేమించా డు. ఈ క్రమంలో గౌసొద్దీన్, సచిన్‌కు గొడవలు జరిగేవి. మూడేళ్లు గడిచాక వీరి కుటుంబం జీవనోపా«ధి కోసం హైదరాబాద్‌లోని రామచంద్రాపు రం పరిధిలో ఉన్న బీరంగూడకు వచ్చింది. అందులో భాగంగా సచిన్‌ ఓ దుకాణంలో కార్పెంటర్‌గా పనికి కుదిరాడు. 

పక్కా ప్రణాళికతో..
గౌసొద్దీన్‌ స్వగ్రామమైన హుమ్నాబాద్‌ నుంచి ప క్కా ప్రణాళికతో హైదరాబాద్‌కు వచ్చాడు. నవీనతో తనకున్న సంబంధానికి అడ్డు వస్తున్న సచిన్‌ను ఎలాగైన అంతమొందించాలని ముందుగానే వ్యూహం రచించుకున్నాడు. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని జగదీశ్‌ మార్కెట్‌ ఏరియాకు వచ్చాడు. అక్కడే ఉంటూ స్థానికంగా ఓ సెల్‌ఫోన్‌ టవర్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక సచిన్‌ను కలిశాడు. తాను కూడా ఉపాధి కోసం వచ్చానని చెప్పి నమ్మించాడు. మరి కొన్ని రోజులు గడిచాక స్నేహం చేస్తున్నట్టుగానే నమ్మించి మద్యం దుకాణానికి తీసుకెళ్లి ఇద్దరు కలిసి మద్యం సేవించేవారు. గౌసొద్దీన్‌ చర్యలు   ఎలాంటి అనుమానం కలిగించకపోవడంతో సచి న్‌ స్నేహాన్ని కొనసాగించాడు. 

ఆస్తిని దక్కించుకునేందుకు పన్నాగం 
తన భర్త మరణం తర్వాత ఉన్న ఇల్లు జగదేవితో పాటు మొదటి భార్య కుమారుడైన సచిన్‌ పేరిట కూడా నమోదైంది. ఆ సగభాగాన్ని ఎలాగైనా తన పేరిట మార్చుకోవాలని జగదేవి కుట్ర పన్నింది. హుమ్నాబాద్‌లోని తమ ఇంటి సమీపంలో నివా సం ఉండే గౌసొద్దీన్‌ తన కుమార్తెను ప్రేమిస్తున్న విషయం తెలిసిన జగదేవి కొత్త కుట్రకు తెరలేపింది. అప్పటికే గౌసొద్దీన్‌తో మృతుడు సచిన్‌ గొడవపడ్డ సంగతిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఏదీఏమైనా ఆస్తిని దక్కించుకోవడమే లక్ష్యంగా పథకం వేసింది. ఎలాగైనా సచిన్‌ ను చంపాలని, ఆ తర్వాత ఆస్తి తనకు, తన కూ తురు నీకు దక్కుతుందంటూ గౌసొద్దీన్‌ను ఉసిగొ ల్పింది. ధైర్యంతో గౌసొద్దీన్‌ సచిన్‌ను చంపి పగను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

కల్లు తాగుదామని తీసుకొచ్చి..
సచిన్‌ను హత్య చేయడమే లక్ష్యంగా కొంతకాలం గా ఎదురు చూస్తున్న గౌసొద్దీన్‌ పథకానికి పదును పెట్టాడు. ఈ నేపథ్యంలో మే 31న గౌసొద్దీన్, సచిన్‌ లక్డీకాపూల్‌లోని మయూరి వైన్స్‌కు పల్సర్‌ బైక్‌పై వెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి బైక్‌పై హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై కి వచ్చారు. ఈ సమయంలోనే మద్యం సేవించేందుకు ఇటువైపు ఎందుకు వెళ్తున్నామని సచిన్‌  గౌసొద్దీన్‌ను ప్రశ్నించాడు. నీకు ఇష్టమైన తాటికల్లు ఈ ప్రాంతంలో లభిస్తుందని నమ్మబలికాడు. అలా చౌటుప్పల్‌ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామానికి సాయంత్రం చేరుకున్నారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ప్లాన్‌తో ఉన్న గౌసొద్దీన్‌ తక్కువ మో తాదులో తాగి సచిన్‌కు పూటుగా తాగించాడు. మద్యం మత్తులో ఉన్న సచిన్‌ను  తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపాడు. సచిన్‌ ఫోన్, ఐడెంటిటీ కార్డులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోయాడు. హైదరాబాద్‌  వెళ్లేందుకు పంతంగి గ్రామం వెళ్లి యూ టర్న్‌ తీసుకునే క్రమంలో రోడ్డు పక్కన చెట్లల్లో కత్తిని పడేశాడు. తూప్రాన్‌పేట గ్రామం దాటాక మూసీ నదిలో సెల్‌ఫోన్, ఐడీ కార్డులు, తదితర వస్తువులు పడేశాడు. ఆ తర్వాత అనుకున్న ప్రకారంగా.. పనిపూర్తయిందని జగదేవికి ఫోన్‌ చేసి చెప్పి తన రూంకు వెళ్లిపోయాడు.

మద్యం సీసా లేబుల్‌తో విచారణ 
హత్య జరిగిన ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. ఎన్నో రకాలుగా శోధించినా ఫలితం కనబడలేదు. కానీ అక్కడే పడి ఉన్న మద్యం సీసాను పోలీసులు గుర్తించారు. హత్యతో ఏదైనా సంబంధం ఉందేమోనన్న అనుమానంతో ఆ సీసాను వెంట తీసుకెళ్లారు. దానిపై ఉన్న లేబుల్‌ను   గమనించారు. వెంటనే మద్యం సరఫరా చేసే డిపోలను సంప్రదించారు. వారిచ్చిన సమాచారం మేరకు లక్డీకాపూల్‌లోని మయూరి వైన్స్‌కు వెళ్లారు. అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీల ఆధారంగా మృతుడు సచిన్‌ను గుర్తించారు. కానీ మృతుడు ఎవరూ, వెంట ఉన్న యువకుడు ఎవరూ అనే విషయం మాత్రం తెలియలేదు. ఆ సమయంలోనే పోలీస్‌శాఖ అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. అందులో భాగంగా లభించిన ఆధారాలతో బైరమల్‌గూడలో నివాసం ఉండే మృతుడి చెల్లి, బావ వద్దకు వెళ్లారు.

తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ, ఫొటోలను చూపించారు. వాటిని చూసిన వారిద్దరు సచిన్‌గా గుర్తించారు. అక్కడ వారి వద్ద తీసుకున్న సమాచారం ఆధారంగా సచిన్‌ను హత్య చేసిన గౌసొద్దీన్‌ను ఆదివారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా పూర్తి వివరాలు వెల్లడించాడు. హత్య చేయమని ప్రోత్సహించింది జగదేవినేనని ఒప్పుకున్నాడు. మృతు డి వద్ద హత్యకు ఉపయోగించిన పల్సర్‌ బైకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేశారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానా న్ని విని యోగించి హత్యకేసును ఛేదించిన చౌటుప్పల్‌ సీఐ వెంకటయ్య, హెడ్‌ కానిస్టేబుళ్లు నర్సిం హ, సత్యం, కానిస్టేబుల్‌ సత్యనారాయణ, హోంగా ర్డులు ఊడుగు సైదులుగౌడ్, ఇస్తారిలను డీసీపీ రామచంద్రారెడ్డి అభినందించారు. రివార్డులు అందజేశారు. నేరం చేసే వ్యక్తులు ఎప్పటికైనా పోలీసులకు చిక్కాల్సిందేనని డీసీపీ పేర్కొన్నారు. ఆయన వెంట సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ నారబోయిన నవీన్‌బాబు, సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు