తెలియని వయసులో ప్రేమలోపడి...

11 Jul, 2018 10:43 IST|Sakshi
ఆస్పత్రిలో మృతుడు రామకృష్ణ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శైలజ

పెళ్లి చేయరన్నభయంతో మైనర్ల ఆత్మహత్యాయత్నం

ప్రియుడి మృతి చావుబతుకుల మధ్య ప్రియురాలు

తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశారని తండ్రి ఫిర్యాదు

తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేయడానికి ఇద్దరూ మైనర్లే..  వివాహానికి అర్హులం కాదని కూడా తెలియని పిన్న వయసు వారిది. తొందరపడ్డారు. తమ ప్రేమ వ్యవహారం కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదు. వారి నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండానే తనువు చాలించాలనుకున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరన్న భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ప్రియుడు చనిపోగా, ప్రియురాలు మృత్యువుతో పోరాడుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాయకరావుపేట మండలం నామవరంలోని సాధారణ వ్యవసాయ కూలీల కుటుంబంలో ఈ విషాదకర సంఘటన   చోటుచేసుకుంది.

పాయకరావుపేట: నామవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ గొర్ల రామకృష్ణ అలియాస్‌ కన్నబాబు(18), శ్రీ చైతన్యపాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక(14) ప్రేమించుకున్నారు. ఆమె తండ్రి సతీష్‌ కుమార్‌ ఒక ప్రైవేటు పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రామకృష్ణ తండ్రి కూడా వ్యవసాయ కూలీనే. కొద్దిరోజులుగా ప్రేమలో పడ్డ వీరిద్దరూ ఈ  నెల 7వతేదీ రాత్రి ఎమినిది గంటల సమయంలో ఇంటి నుంచి పరారయ్యారు. ఈమేరకు బాలిక తండ్రి  అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారైన వీరు ఇదే మండలం గోపాలపట్నం సమీపంలో ఉన్న సీతమ్మవారి మెట్టవద్దకు 8వ తేదీ ఉదయం చేరుకున్నారు.

రామకృష్ణ తన సోదరుడికి ఫోన్‌ చేసి తాను ఓ బాలికను ప్రేమించానని, పెళ్లికి అంగీకరించనందున పురుగుమందు తాగి చనిపోతున్నామని చెప్పాడు. దీంతో కంగారు పడ్డ సోదరుడు అలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని..ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నాడు. వారున్న స్థలం తెలపడంతో ఈ విషయం పోలీసులకు చెప్పారు. వెంటనే  8వ తేదీన ఎకాయెకిన సీతమ్మవారి మెట్టవద్దకు వెళ్లి చూసే సరికి ఇద్దరూ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని తునిలోని  ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం రామకృష్ణ మరణించాడు. ఇద్దరూ మైనర్లే కావడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

చంపడానికే మా కుమార్తెను తీసుకుపోయాడు
తమ కుమార్తె శైలజ ప్రేమవ్యవహారం తమకు తెలియదని తల్లిలక్ష్మి తెలిపింది. ఆమెను లోబరుచుకుని చంపడానికే తీసుకుపోయాడంటూ బోరున విలపించింది. పెద్దల సూచనమేరకు న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

శైలజ తల్లి లక్ష్మి
 

మరిన్ని వార్తలు