ఇద్దరి ప్రాణాలు తీసిన ఆన్‌లైన్‌ జూదం

30 May, 2019 07:58 IST|Sakshi
మృతి చెందిన అరుల్‌వేల్, రాజలక్ష్మి (ఫైల్‌)

అన్నానగర్‌ : ఆన్‌లైన్‌ జూదం ఆడి అప్పులపాలు కావడంతో విరిక్తి చెంది తల్లి సహా కుమారుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటనబన్రూటిలో జరిగింది. కడలూరు జిల్లా బన్రూటి మేలప్పాళయం సుందర్‌నగర్‌కు చెందిన సిట్రరసు (75) రైతు. ఇతని భార్య రాజ్యలక్ష్మి (70). ఈ దంపతుల కుమారుడు అరుల్‌వేల్‌ (36) కంప్యూటర్‌ ఇంజినీర్‌. ఇతనికి బన్రూటి సమీపంలో ఉన్న సిరుతొండమాదేవికి చెందిన శేఖర్‌ కుమార్తె దివ్య (30)తో నాలుగేళ్ల ముందు వివాహం జరిగింది. వీరికి ప్రణవ్‌ (03) అనే  కుమారుడు ఉన్నాడు. అరుల్‌వేలు, దివ్య చెన్నైలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఈ స్థితిలో అరుల్‌వేల్‌ తన స్నేహితులు, బంధువుల వద్ద నుంచి లక్షల అప్పు తీసుకుని ఆన్‌లైన్‌లో జూదంలో ఆడి బాగా నష్టపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారు, నగదు తిరిగి ఇవ్వమని అరుల్‌వేల్‌పై ఒత్తిడి పెట్టారు. దీంతో నెల ముందు అరుల్‌వేల్‌ ఉద్యోగం వదిలేసి, బన్రూటిలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు.

దివ్య తన కుమారుడితో చెన్నైలోనే ఉంది. ఈ స్థితిలో అప్పు ఇచ్చిన వారు బన్రూటికి వచ్చి అప్పు తిరిగి ఇవ్వాలని అరుల్‌వేల్‌పై ఒత్తిడి పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన అరుల్‌వేల్‌ తనకు జీవించడానికి ఇష్టంలేదని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తల్లి రాజ్యలక్ష్మి వద్ద తెలిపాడు. అందుకు రాజ్యలక్ష్మి మనమిద్దరం కలసి ఆత్మహత్య చేసుకుందామని చెప్పింది. దీంతో అరుల్‌వేల్, మంగళవారం సిట్రురసు ఇంటి నుంచి బయటికి వెళ్లగానే తల్లి, కుమారుడు ఇద్దరూ విషం తాగారు. ఈ క్రమంలో ఇంటికి తిరిగి వచ్చిన సిట్రరసు రాజ్యలక్ష్మి నోటిలో నురుగు వచ్చిన స్థితిలో మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆమె పక్కన అరుల్‌వేల్‌ స్పృహతప్పిన స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. వెంటనే సిట్రరసు స్థానికుల సాయంతో అరుల్‌వేల్‌ను బన్రూటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ  చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన గురించి బన్రూటి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు