సిటీలోనూ ‘సైకో కిల్లర్‌’ ఛాయలు!

19 Dec, 2019 07:49 IST|Sakshi
అరుణ్‌ చేతిలో హత్యకు గురైన సులోచన(ఫైల్‌)

గత ఏడాది తిరుమలగిరిలో వృద్ధురాలి హత్య

ఈ కేసులో తల్లి, ప్రియురాలితో సహా కటకటాల్లోకి

తాజాగా రామాయంపేట అత్యాచారం కేసులో అరెస్ట్‌

సాక్షి, సిటీబ్యూరో: మెదక్‌ జిల్లా రామాయంపేటలో వివాహితపై అత్యాచారం, దారుణ హత్య కేసులో బుధవారం అక్కడి పోలీసులకు చిక్కిన సైకో కిల్లర్‌ అరుణ్‌ గత ఏడాది నగరంలోనూ ఓ నేరం చేశాడు. నార్త్‌జోన్‌లోని తిరుమలగిరి ఠాణా పరిధిలో సులోచన అనే వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి దోపిడీకి పాల్పడ్డాడు. ఇతడిపై ఇప్పటి వరకు మూడు హత్య కేసులతో పాటు మరికొన్ని నేరాలు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. నిజామాబాద్‌కు చెందిన బ్యూటీషియన్‌ అయిన వివాహిత హత్యాచారం కేసులో రామాయంపేట పోలీసులు తాజాగా అరుణ్‌ను పట్టుకోవడంతో  కలకలం రేగింది. తిరుమలగిరిలోని కమల లయ ఎన్‌క్లేవ్‌లో సులోచన తన భర్త కాంతారావుతో కలిసి నివాసం ఉండేది. కాంతారావు పక్షవాతం బారిన పడటంతో తమ ఇంట్లో పని చేసేందుకు కేర్‌ టేకర్‌ కావాలంటూ గత ఏడాది పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దీనిని చూసిన నిజామాబాద్‌ జిల్లా, డిచ్‌పల్లి సమీపంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన అరుణ్‌ గత ఏడాది మే 7న ఉద్యోగంలో చేరాడు. అందినకాడికి దోచుకోవాలనే కుట్రతోనే ఇతగాడు ఉద్యోగం వంకతో అక్కడికి వచ్చాడు.

ఓ దశలో అరుణ్‌ వ్యవహారశైలిని అనుమానించిన సులోచన అతడిని మాన్పించేయాలని భావించినా... అది ఆలస్యం కావడం ఆమె పాలిట శాపమైంది. అదే నెల 18న దోపిడీకి పథకం పన్నిన అరుణ్, నిజామాబాద్‌ జిల్లా, మెట్రస్‌పల్లికి చెందిన తన ప్రియురాలు సరస్వతిని నగరానికి రప్పించాడు. ఆ రాత్రి ఇద్దరూ కలిసి సులోచన ఇంట్లోని ఓ గదిలోనే చాలాసేపు గడిపారు. ఆమె నిద్రపోయిందని నిర్థారించుకున్న తర్వాత రాత్రి 12.30 గంటల ప్రాంతంలో వారి బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించిన ఇద్దరూ సులోచనను హత్య చేశారు. అరుణ్‌ దిండుతో ఆమె ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేయగా... సులోచన కాళ్లు కదలకుండా సరస్వతి గట్టిగా పట్టుకుంది. అప్పటికీ ఆమె చనిపోలేదని భావించిన వరుణ్‌ వంటింట్లో నుంచి కత్తి తీసుకువచ్చి కడుపులో పొడిచాడు. అనంతరం ఆమె ఒంటి పైన, ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బు చేజిక్కించుకున్న ఈ జంట తెల్లవారుజాము వరకు అక్కడే గడిపి ఆపై జారుకున్నారు. ఈ సొత్తును అరుణ్‌ తన తల్లి రాజమణికి ఇచ్చి అమ్మించాడు. తిరుమలగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలో నమోదైన ఈ హత్య కేసును దర్యాప్తు చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత ఏడాది మే 26న అరుణ్, సరస్వతి, రాజమణిలను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. రామాయంపేటలో బ్యూటీషియన్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన అరుణ్‌ కొన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. హైదరాబాద్‌ నగరానికి వచ్చి మళ్లీ కేర్‌టేకర్‌గా పని చేయాలనే ఉద్దేశంతో బయలుదేరిన అరుణ్‌ బుధవారం రామాయంపేట పోలీసులకు పట్టుబడ్డాడు. 

మరిన్ని వార్తలు