ట్రంప్ కుమారుడికి పార్శిల్.. నిందితుడి అరెస్ట్

2 Mar, 2018 09:55 IST|Sakshi
డోనాల్డ్ ట్రంప్‌, డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌ (ఫైల్‌ ఫొటో)

అనుమానాస‍్పద వైట్ పౌడర్ పంపిన నిందితుడు

మరో నలుగురికి బెదిరింపు పార్శిల్స్

నిందితుడిని పట్టించిన ఫేస్‌బుక్ పోస్ట్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు ఇటీవల ఓ అనుమానాస్పద పార్శిల్ పంపి కలకలం రేపిన వ్యక్తిని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మసాచుసెట్స్‌కు చెందిన డానియల్ ఫ్రిసెల్లో అని అతడు డెమొక్రటిక్ పార్టీ కార్యకర్త అని, ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత నెలలో డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు ఓ పార్శిల్ వచ్చింది. ఓపెన్ చేసిన చూడగా అందులో వైట్ పౌడర్ ఉండటం కలకలం రేపింది.

నిందితుడు ఫ్రిసెల్లో గతంలోనూ పలు చిన్న చిన్న తప్పిదాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు పౌడర్ పార్శిల్ పంపిన అదే నిందితుడు మరో నలుగురు వ్యక్తులకు ఇలాగే పార్శిల్స్ పంపి హెచ్చరికలు జారీ చేశాడు. కాలిఫోర్నియాకు చెందిన ఓ లాయర్, లా ప్రొఫెసర్, ఓ సెనెటర్, నటుడు ఆంటోనియా సబాటోలకు మెయిల్స్ పంపినట్లు పోలీసుల తమ విచారణలో తెలుసుకున్నారు.

నిందితుడు ఫ్రిసెల్లోని అతడి ఫేస్‌బుక్ అకౌంట్ ఆధారంగానే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రంప్ జూనియర్‌కు పంపిన పౌడర్ పార్శిల్ కవర్‌ను తన ఎఫ్‌బీలో ఫ్రిసెల్లో ఫిబ్రవరి 12న పోస్ట్ చేశాడు. దాంతో పాటుగా ఓ బాంబు పార్శిల్ సందర్భంగా తన అసలుపేరును నిందితుడు రాయడం కేసును ఈజీగా ఛేదించేందుకు ఉపయోగపడిందని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో ట్రంప్ వ్యతిరేక పోస్టులు చాలా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు