వేటకు వెళ్లి విగతజీవిగా...

27 Jan, 2018 10:29 IST|Sakshi

అనుమానాస్పద స్థితిలో           

మత్స్యకారుడు మృతి

రోడ్డున పడిన కుటుంబం

శ్రీకాకుళం, వంగర: శ్రీహరిపురం గ్రామానికి చెందిన గుడివాడ ఉగాది దొర(36) అనే మత్స్యకారుడు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వంగర పోలీసులు అందించిన వివరాలు ప్రకారం... సహచరులు గుడివాడ చిరంజీవి, కారంగి గణేష్‌తో కలిసి ఉగాది దొర ఉదయం ఐదు గంటల సమయంలో మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లాడు. పెద్ద దేవకివాడ చేపల రేవు సమీపంలో బోట్లు లంగరు వేసిన ప్రాంతంలో వీరు ముగ్గురు విడిపోయి వేర్వేరు దారుల్లో చేపల వేటకు వెళ్లిపోయారు. ఉదయం 6.30 గంటల సమయంలో సహచర మత్స్యకారులు అటువైపు చూసే సరికి ఉగాదిదొర మృతిచెంది ఉన్నట్టు గమనించారు. మృతుడు తలపై స్వల్ప గాయాలు ఉన్నాయి.

మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా భార్య గుడివాడ పాపమ్మతో పాటు కుటుంబ సభ్యులు బోరున రోదించారు. మృతుడుకు భార్య పాపమ్మతో పాటు ఎనిమిదేళ్ల పావని, ఐదేళ్ల జగదీష్‌ ఉన్నారు. తన భర్తను ఎవరో చంపి ఉంటారని, తల భాగంలో గాయాలున్నాయని భార్య పాపమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ హెచ్‌.కాంతారావు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

శోకసంద్రంలో గ్రామం
అందరితో కలిసిమెలసి సరదాగా ఉండే ఉగాది దొర మృతిచెందడంతో శ్రీహరిపురం గ్రామంలో శోకసంద్రం నెలకొంది. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని, తమ కుటుంబం వీధిన పడిందని భార్య పాపమ్మ, బంధువులు రోదనలు అందరినీ కన్నీరు తెప్పించాయి.

మరిన్ని వార్తలు