కాపాడబోయి కాలిపోయాడు  

26 May, 2018 09:59 IST|Sakshi
మృతుడి ఇంటి వద్ద గుమిడూడిన జనం, లక్ష్మీ్మనారాయణగౌడ్‌(ఫైల్‌)

గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తి మృతి

భార్య, తల్లిని రక్షించబోయి దుర్మరణం

షాబాద్‌ మండలం నాందర్‌ఖాన్‌పేట్‌లో ఘటన

షాబాద్‌(చేవెళ్ల) : ఇంట్లో వంటచేస్తుండగా గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన షాబాద్‌ మండలంలోని నాందార్‌ఖాన్‌పేట్‌ గ్రామంలో చోట్టు చేసుకుంది. ఎస్సై రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం...

మండలంలోని నాందార్‌ఖాన్‌పేట్‌ గ్రామానికి చెందిన గంగాపురం లక్ష్మీనారాయణగౌడ్‌(35) గురువారం ఉదయం ఇంట్లో అతడి భార్య లావణ్య, తల్లి అమృతమ్మలు గ్యాస్‌ పొయ్యిపై వంట చేస్తుండగా గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలి మంటలు రావడంతో వారిద్దరూ మంటల్లో చిక్కుకున్నారు.

ఇది గయనించిన లక్ష్మీనారాయణగౌడ్‌ వారిని కాపాడేందుకు ప్రయత్నించగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో మంటల్లో పడి అక్కడిక్కడే మృతిచెందాడు. అతడి భార్య లావణ్య, తల్లి అమృతమ్మలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

వారితో పాటు లక్ష్మీనారాయణగౌడ్‌ కుమారుడు త్రీశూల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు చేవెళ్ల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలార్పారు. సంఘటన స్ధలాన్ని పరిశీలించిన చేవెళ్ల ఏసీపీ స్వామి ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

క్లూస్‌టీం సిబ్బంది సంఘటన స్ధలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి సోదరుడు సురేష్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంఘటన స్ధలానికి చేరుకున్న ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి... 

గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తి మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి నగరం నుంచి వెంటనే నాందార్‌ఖాన్‌పేట్‌కు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అక్కడున్న గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నెంటూరి రవీందర్‌రెడ్డి మృతుని ఇంటి వద్దకు వచ్చి ప్రమాదం గురించి వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట వివిధ పార్టీల నాయకులు నర్సింహారెడ్డి, యాదయ్య, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు