కూతురి నిశ్చితార్థం.. ప్రమాదంలో కుమారుడి మృతి 

10 Jul, 2018 14:04 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబీకులు 

శోకసంద్రంలో కుటుంబసభ్యులు

న్యాయం చేయాలని గ్రామస్తుల ఆందోళన

డీఆర్వో హామీతో విరమణ

వేములవాడరూరల్‌ : కూతురి నిశ్చితార్థం జరుగుతుందన్న సంతోషం కొన్ని క్షణాల్లోనే మాయమైంది. మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ కొడుకు ప్రాణాలు తీసుకుంది. నిశ్చితార్థం కోసం వచ్చిన బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం విషాదంలో మునిగింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరంలో విషాదం నింపింది.

గ్రామానికి చెందిన పల్లి శంకర్‌–రేణుక కుమార్తెకు నిశ్చితార్థం సోమవారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన తమలపాకులు, కేకును తీసుకొచ్చేందుకు వారి కుమారుడు సాయి(22) తన స్నేహితుడు ప్రశాంత్‌ను తీసుకొని బైక్‌పై వేములవాడకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా అనుపురం, రుద్రవరం గ్రామ సమీపంలో వీరి బైక్‌ను లారీ ఢీకొట్టింది. ప్రశాంత్‌ ఎగిరిపడగా కాలు విరిగింది.

సాయిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ లారీకిందనే చిక్కుకుపోయింది. లారీ డ్రైవర్‌  ఆపకుండానే దాదాపు 9 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. బైక్‌ను లాక్కెళ్తున్న లారీని గమనించిన యువకులు వెంబడించడంతో కొదురుపాక–వెంకట్రావుపల్లి గ్రామాల మధ్య లారీని నిలిపి డ్రైవర్‌ పరారయ్యాడు. మృతుడి తండ్రి శంకర్‌ ఫిర్యా దుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటస్వా మి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

అయ్యో కొడుకా..!  

ఇంటిలో జరుగుతున్న శుభకార్యంలో అందరితో అప్పటి వరకు కలిసి పనిచేసిన సాయి కొన్ని నిమిషాల్లోనే చనిపోయాడని విన్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. భోజన కార్యక్రమంలో అందరికీ వడ్డించిన సాయి విగతజీవిగా కనిపించడంతో రోదనలు మిన్నంటాయి. ఒ క్కగానొక్క కుమారుడు లారీ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది.    

కన్నీటి పర్యంతమైన స్నేహితులు 

అప్పటి వరకు స్నేహితులతో కలిసి ఉన్న సాయి మృతితో స్నేహితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మన సాయి ఇక లేడంటూ రోదించిన తీరు అందరినీ కలిచివేసింది.   

గ్రామస్తుల ఆందోళన 

ప్రమాద విషయం తెలుసుకున్న రుద్రవరం గ్రామస్తులు కరీంనగర్‌–సిరిసిల్ల ప్రధాన రోడ్డుపై ఆందో ళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ దాదాపు నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఇసుక లారీలు అతివేగంగా వస్తుండడంతో రోడ్డుపక్కనే ఉన్న పునరావాస గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు.

మూడు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారని, అది మరిచిపోకముందే మరొకరు చనిపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగంతోపాటు లారీ యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పించాలంటూ గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

విషయం తెలుసుకున్న డీఆర్‌ఓ శ్యాంప్రసాద్‌లాల్, సీఐ వెంకటస్వామి, తహసీల్దార్‌ మునీందర్‌ సంఘటన స్థలానికి వచ్చి లారీ యజమానితో మాట్లాడి న్యాయం చేస్తామని, ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఇప్పించి, గాయపడిన ప్రశాంత్‌కు వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు.

దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా న్యాయం చేస్తానని డీఆర్‌ఓ తెలిపారు.  మృతుడి కుటుంబానికి రూ.5లక్షలు, గాయపడ్డ యువకుడి కుటుంబానికి రూ.3లక్షల చెక్కును కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అందించారు.

మరిన్ని వార్తలు