గొంతు కోసేసిన గాలిపటం...ఇంజనీర్‌ మృతి

17 Aug, 2019 14:49 IST|Sakshi

న్యూఢిల్లీ : రాఖీ పండుగ నాడు సంతోషంగా చెల్లెళ్లతో బయల్దేరిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. బైక్‌పై వెళ్తున్న అతడిని చైనా మాంజా రూపంలో విధి కబలించింది. ఈ విషాదకర ఘటన ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో చోటుచేసుకుంది. వివరాలు...ఢిల్లీలోని బుద్ధ విహార్‌కు చెందిన మానవ్‌ శర్మ(28) సివిల్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. గురువారం రక్షాబంధన్‌ సందర్భంగా ఇద్దరు చెల్లెళ్లు అతడికి రాఖీ కట్టారు. అనంతరం ముగ్గురూ కలిసి స్కూటర్‌ మీద చిన్నమ్మ ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో పశ్చిమ విహార్‌ ఫ్లైఓవర్‌పైకి చేరగానే ఓ గాలి పటానికి ఉన్న దారం మానవ్‌ మెడను చుట్టుకొంది. క్షణాల్లోనే అతడి గొంతును చీల్చివేసింది. దీంతో ముగ్గురూ కిందపడిపోయారు.

ఈ క్రమంలో ఫ్లైఓవర్‌ మీద నుంచి వెళ్తున్న ఇతర ప్రయాణీకులు వారిని ఆస్పత్రికి తరలించారు. మానవ్‌ దారి మధ్యలోనే మరణించగా.. అతడి చెల్లెళ్లు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారిని త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు. కాగా మానవ్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇక గాలి పటాలు ఎగురవేసేందుకు ఉపయోగించే చైనా మాంజాలు అత్యంత ప్రమాదకరమైనవన్న విషయం తెలిసిందే. వీటి కారణంగా ఎంతో మంది తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఈ క్రమంలో వీటిపై నిషేధం విధించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు