రూ.100 కోసం హత్య 

27 May, 2018 07:08 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ భుజంగరావు 

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 

ఇద్దరు కలిసి మద్యం తాగేవారు  

అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో హత్య 

భాగ్యనగర్‌కాలనీ :  క్షణికావేశంలో ఓ వ్యక్తిపై కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో శనివారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ భుజంగరావు నిందితుడి వివరాలు వెల్లడించారు. మూసాపేటలో నివాసముంటున్న బంక సైదులు(25) జేకే పాయింట్‌ హోటల్‌లో సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో పెయింటింగ్‌ పని కూడా చేశాడు. అయితే ఆ సమయంలో మృతుడు సయ్యద్‌ పాషాతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఇరువురు కలిసి కల్లు తాగేవారు. ఈ క్రమంలోనే సయ్యద్‌ పాషా సైదులు వద్ద రూ.100 అప్పుగా తీసుకున్నాడు.

అయితే ఈ నెల 24వ తేదీన కల్లు కాంపౌండ్‌ నుంచి సయ్యద్‌ పాషా బయటకు వస్తుండగా గమనించిన నిందితుడు సైదులు తన వద్ద నుంచి తీసుకున్న రూ.100 ఇవ్వమని అడగడంతో పాషా పక్కకు నెట్టివేయటంతో సైదులు కింద పడిపోయాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకుని సమీపంలో ఉన్న కర్రతో మారుతినగర్‌లో పాషాపై దాడి చేశాడు. దీంతో తల, మొహంపై తీవ్రగాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య చాంద్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడు సైదులును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో అడిషనల్‌ సీఐ మహేష్‌గౌడ్, ఎస్‌ఐ భానుప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు