గర్భిణి అని చూడకుండా.. కట్టుకున్నోడే ఉసురు తీశాడు

26 Aug, 2019 09:49 IST|Sakshi

మరో రెండు రోజుల్లో మూడవ కాన్పులో పండంటి శిశువుకు జన్మనిస్తాననే ఆనందంలో ఉన్న ఆమె పాలిట కట్టుకున్నోడే కిరాతకుడయ్యాడు. గొంతుకు తాడు బిగించి హతమార్చాడు. ఊపిరి పోతున్న వేళ ఆమెతో పాటు గర్భస్త శిశువు కూడా ఎంతగా విలవిలలాడిందో!?  ఈలోకంలో కళ్లు తెరవకముందే తల్లి కడుపులోనే గర్భస్త శిశువూ కన్నుమూసింది. ఆ కర్కోటకుడు ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాడని ఊరంతా కన్నీరుమున్నీరైంది.

సాక్షి, గంగవరం(చిత్తూరు) : నిండు గర్భిణిని అయిన తన భార్యను తాడుతో గొంతు బిగించి హతమార్చాడో కసాయి భర్త. ఈ ఘటన మండలంలో ఆదివారం వెలుగు చూసింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం.. మండలంలోని జంగాలపల్లెకు చెందిన గట్టప్ప,యశోదమ్మ దంపతులు తమ కుమార్తె మీనా(24)ను ఆరేళ్ల క్రితం పలమ నేరు మండలం పి.ఒడ్డూరులోని నారాయణకు ఇచ్చి వివాహం చేశారు. తాను పలమనేరులోని ఓ ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి అని చెప్పి నారాయణ వారిని మభ్యపెట్టాడు. వివాహమైనప్పటి నుంచి నారాయణ మీనాను పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ వేధించేవాడు. కుమార్తె కాపురం నిలబెట్టేందుకు లక్షల రూపాయలు ఇచ్చి అత్తారింటికి పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా అతని తీరు మారలేదు. ఏ పనీ చేయకపోగా జులాయిగా తిరుగుతూ తరచూ డబ్బులు తేవాలంటూ వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న కావిళ్ల పండగకు దంపతులిద్దరూ జంగాలపల్లెకు వచ్చారు. 15రోజులుగా భర్తతో సహా పుట్టింటిలోనే ఉంటోంది. అంతేకాకుండా  మీనాకు 9నెలలు నిండుతుండడంతో పుట్టింట కాన్పు చేసుకోవాలని ఎంతో ఆశ పడింది.  శనివారం తన భార్యకు నారాయణ పలమనేరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాడు. ఇక రెండు రోజుల్లో ప్రసవిస్తుందని, మరింత జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దీంతో మీనా కూడా సంబరపడింది.

ఆ తర్వాత ఏమైందంటే..
ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన నారాయణ కసాయిగా మారాడు. రాత్రంతా భార్యను వేధించాడు. తలపై కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. తరువాత గొంతుకు తాడుతో గట్టిగా బిగించి హతమార్చాడు.  ఇంటి వెనుక మరో ఇంట నిద్రిస్తున్న మృతురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదు. ఆదివారం తెల్లవారగానే 18నెలల కుమార్తెను అత్తమామలకు అప్పగించాడు. తన భార్య స్పృహ కోల్పోయిందని కథ అల్లి, అక్కడి నుంచి నారాయణ పారిపోయాడు. అల్లుడి మాటలకు ఆందోళన చెందిన మీన తల్లిదండ్రులు ఉరుకులు పరుగులతో వెళ్లి ఇంటి తలుపు తెరవగా అప్పటికే ఆమె విగతజీవిగా పడి ఉండటం చూసి దిగ్భ్రాంతి చెం దారు. గుండెలవిసేలా రోదించారు. ఇదలా ఉంచితే, మీన మొదటి కాన్పులో ప్రసవించిన శిశువు పురిట్లోనే మృతి చెందింది. తరువాత రెం డవ కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మూడో కాన్పుకు సిద్ధమైన సమయంలో భర్త చేతిలో తిరిగిరాని లోకాలకు చేరుకుంది. 

పరిశీలించిన పోలీసు, రెవెన్యూ అధికారులు
భర్త చేతిలో నిండు గర్భిణి హతమైందని సమాచారం అందడంతో పలమనేరు డీఎస్పీ ఆరీ ఫుల్లా, సీఐ రామక్రిష్ణాచారి, తహసీల్దార్‌ బెన్నురాజ్‌ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మీనా మృతిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని మీన తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. మృతురాలికి ఎటువంటి బీమా సౌకర్యం ఉన్నా వెంటనే వచ్చేలా చూసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మీన మృతదేహం వద్ద మా..మా.. మా.. అంటూ వచ్చీ రాని మాటలతో బిక్కు బిక్కుమని చూస్తూ ఉన్న మీన 18 నెలల కుమార్తెను చూపరుల గుండె తరుక్కుపోయింది. తల్లి ప్రేమకు శాశ్వతంగా దూరమైందని అధికారులు సైతం విచలితులయ్యారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా