అక్కనే అంతమొందించాడు!

4 Jun, 2018 08:42 IST|Sakshi
భరత్‌ (ఫైల్‌), వనిత (ఫైల్‌)

చిత్తూరులో దారుణం తల్లి, కొడుకు హత్య

అనంతరం యువకుడి  ఆత్మహత్య

నేడు సమాజంలో నైతిక విలువలు కనిపించడం లేదనడానికి ఈ సంఘటన నిదర్శనం. వరుసకు అక్క అయినమహిళతో చనువుగా ఉండడమే కాకుండా ఆమెను అనుమానించాడు. తనకు దూరమవుతోందని భావించాడు. ఆమెతోపాటు ఆమె కొడుకు ఏడేళ్ల బాలుడిని కిరాతకంగా హత్య చేశాడు. భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న ఆమెకు అండగా ఉండాల్సిన వాడే ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం సృష్టించింది. తల్లి, కొడుకును హత్య చేసిన అనంతరం అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

చిత్తూరు రూరల్‌: వరుసకు అక్క, ఆమె కొడుకుని ఓ రాక్షసుడు నిర్ధాక్షిణ్యంగా నరికి చంపాడు. అనంతరం అతనూ ఉరి వేసుకుని తనువు చాలిం చాడు. ఈ ఘటన చిత్తూరు మండలం మర్రిగుం టలో కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చిం ది. ఏఎస్పీ రాధిక, డీఎస్పీ సుబ్బారావు, సీఐ ఆదినారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మర్రిగుంట గ్రామానికి చెందిన పురుషోత్తంకు, గంగవరం మండలం కలవత్తూరుకు చెందిన వనిత(30)కు 12 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి కుమార్తె, కుమారుడు మహేంద్రన్‌ (7) ఉన్నారు. కుటుంబంలో ఏర్పడిన కలహాల కారణంగా నాలుగేళ్ల క్రితం పురుషోత్తం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత వనిత వరుసకు తమ్ముడైన భరత్‌తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. కొన్నాళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

అనుమానంతోనే హత్య చేశాడా..?
ఇటీవల వనిత తీరుతో వీరి మధ్య దూరం పెరిగింది. అంతేగాక ఆమె ఎక్కువగా పుట్టినింట్లో గడుపుతోంది. ఇంటి పని నిమిత్తం అప్పుడప్పుడు మాత్రమే మర్రిగుంటకు వస్తోంది. దీంతో ఆమె ప్రవర్తనపై భరత్‌కు అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి వివాహ వేడుకలకు బయలుదేరిన భరత్‌ మనస్తాపం చెంది  మద్యం మత్తులో వనితను హత్యచేయడంతో పాటు అడ్డుగా ఉన్న మహేంద్రన్‌ను కూడా కత్తితో విచక్షణా రహితంగా నరికి ఉండవచ్చునని పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు. అనంతరం తాను కూడా ఆ పూరి గుడిసెలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేకేత్తిస్తోంది.

ఎంతకూ తలుపులు తీయకపోవడంతో..
ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో వనిత మామ సుబ్రమణ్యం ఇంటి వద్దకు వచ్చాడు. ఎంతకూ తలుపులు తీయకపోవడంతో బలవంతంగా తెరిచాడు. లోపల కోడలు, మనవడు నిర్జీవులై పడివుండడాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఆయన అరుపులు, కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కాలనీకి చెందిన భరత్‌ కూడా ఉరివేసుకుని ఉండడాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా ఎస్‌ఐ సోమశేఖర్‌రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఏఎస్పీ రాధిక, డీఎస్పీ సుబ్బారావు, సీఐ ఆదినారాయణ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీ మాట్లాడుతూ గ్రామస్తుల విచారణలో ఎటువంటి సమాచారం లభించలేదన్నారు. క్లూస్‌ టీమ్‌ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తామన్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫోన్‌ సంభాషణలను ఆరా తీయగా ఇద్దరూ చాలా సేపు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల లోతు విచారణ పూర్తి చేసిన తరువాత మృతదేహలను బందువులకు అప్పగించనున్నారని తెలిసింది.

శోకసంద్రంలో మర్రిగుంట
వనితతోపాటు ఆమె కొడుకు హత్యకు గురికావడంతో మర్రిగుంటలో విషాదం అలుముకుంది. రక్తపు మడుగులో ఉన్న బాలుడి మృతదేహాన్ని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ పసిబిడ్డ అని కూడా చూడకుండా హత్య చేయడా నికి చేతులెట్లా వచ్చాయోనని వాపోయారు. పసికందు వెనుక ఏదైనా నిజం దాగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు