అనుమానాస్పద స్థితిలో బాలింత మృతి

3 Jun, 2020 07:28 IST|Sakshi
కన్నబిడ్డతో తల్లి ఆర్తి (ఫైల్‌)

వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణం తీసిందంటూ బంధువుల ఆందోళన

ఖైరతాబాద్‌: కన్నబిడ్డకు పాలిచ్చేందుకు వచ్చిన తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడలో నివాసం ఉంటున్న రాజేష్, ఆర్తి (24)లకు 2017లో వివాహం జరిగింది. ఇటీవల గర్భం దాల్చిన ఆర్తిని డెలివరీ కోసం చింతల బస్తీలోని విజయమేరి హాస్పిటల్‌లో గత నెల 27న అడ్మిట్‌ చేశారు బంధువులు. 28న వైద్యులు శస్త్ర చికిత్స చేసి డెలివరీ చేయగా పాపకు జన్మనిచ్చింది. పుట్టిన పాప గ్రోత్‌ సరిగా లేదని హాస్పిటల్‌ని ఎన్‌ఐసీయూలో ఉంచారు. 31న తల్లి ఆర్తిని డిశ్చార్జి చేస్తున్నామని చెప్పారని.. అయితే పాపకు పాలు ఇవ్వాల్సి ఉండగా హాస్పిటల్‌లోనే ఉంటోంది. ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం ఆమెకు  ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రి వర్గాలకు బంధువులు తెలియజేశారు. డెలివరీ అయిన తర్వాత సాధారణంగా ఛాతీలో నొప్పి వస్తుందని, వాకింగ్‌ చేస్తే సరిపోతుందని చెప్పినట్లుగా బంధువులు పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆర్తి పాపకు పాలు ఇచ్చేందుకు వెళ్లింది. పాలు రాకపోవడంతో పాపకు పాలు పట్టేందుకు నర్సు వేడి నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. నర్సు తిరిగి వచ్చే సరికి ఆర్తి బెడ్‌పై పడిపోయి ఉంది. నర్సు ఎంత లేపినా లేవలేదు. దీంతో డాక్టర్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన డాక్టర్లు ఆమెను పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. విషయం తెలిసిన వెంటనే మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు ఆర్తి తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే చనిపోయిందని ఆందోళనకు దిగారు. హాస్పిటల్‌ నుంచి తాము డిశ్చార్జి చేశామని, సాధారణంగా బాలింతల కాళ్లలో రక్త సరఫరా సరిగా లేకపోవడం (ఎంబోలిజం) అనే సమస్య వల్ల హార్ట్‌ ఫెయిల్యూర్‌ సమస్య వచ్చే అవకాశాలుంటాయని హాస్పిటల్‌ వర్గాలు తెలిపాయి. మృతురాలి భర్త రాజేష్‌ ఫిర్యాదు మేరకు సైఫాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు