నా సెల్‌ నంబర్‌ బ్లాక్‌ చేశారు

24 Jun, 2019 12:59 IST|Sakshi

ఎంపీ అన్న మర్యాద కూడా లేదు

కరూర్‌ కలెక్టర్‌ తీరుపై జ్యోతిమణి ఫైర్‌

ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు

లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయం ముదిరిన వార్‌

సాక్షి, చెన్నై: కరూర్‌ కలెక్టర్, ఎంపీ జ్యోతిమణిల మధ్య వార్‌ మరింతగా ముదురుతోంది. ఎంపీ అన్న కనీస మర్యాద కూడా తనకు కలెక్టర్‌ ఇవ్వడం లేదని జ్యోతిమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే, పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు చేశారు. తన సెల్‌ నంబర్‌ను ఆయన బ్లాక్‌ చేసి ఉండడం బట్టిచూస్తే, ఏ మేరకు కలెక్టర్‌ తీరు ఉందో స్పష్టం అవుతోందని ఆమె  ఆగ్రహం వ్యక్తం చేశారు.లోక్‌సభ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి కరూర్‌ లోక్‌సభ  నియోజకవర్గంలో రాజకీయ వివాదం రాజుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ అన్నాడీఎంకే అభ్యర్థిగా గత ›ప్రభుత్వంలో పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై రేసులో ఉండడం ఇందుకు కారణం. అలాగే, ఆయనపై తీవ్ర వ్యతిరేకత నియోజకవర్గంలో ఉండడాన్ని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతిమణి తీవ్రంగానే ఓట్ల వేట సాగించారు. అయితే, ఎన్నికల నామినేషన్‌ దాఖలు మొదలు, ప్రచారాల అనుమతి వరకు అడుగడుగునా జ్యోతిమణికి అడ్డంకులు తప్పలేదు. కరూర్‌ జిల్లా డీఎంకే నేత, మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఆయన్ను అధికారులు టార్గెట్‌ చేశారన్న ప్రచారం ఎన్నికల వేళ జోరుగానే సాగింది.

ఇందుకు తగ్గట్టుగా బెదిరింపుల ఆడియోలు, వీడియోలు ఆ సమయంలో వైరల్‌గా మారాయి. ఇక, కరూర్‌ కలెక్టర్‌ ఎన్నికల అధికారి వ్యవహరించిన అన్భళగన్‌ అధికార పక్షానికి ప్రత్యక్షంగానే సహకరిస్తున్నారంటూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జ్యోతిమణి, అరవకురిచ్చి అసెంబ్లీ డీఎంకే అభ్యర్థిగా సెంథిల్‌ బాలాజి తీవ్రంగానే విరుచుకుపడ్డారు. అదే సమయంలో ప్రచార ముగింపు రోజున సాగిన అల్లర్లు, ఎన్నికల రోజున వివాదాలు...ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతి విషయంలోనూ అధికారులు అధికార పక్షానికి అండగా వ్యవహరించారన్న ఆరోపణల్ని, ఆగ్రహాన్ని ప్రతి పక్షాలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వరకు తీసుకెళ్లాయి. ఈవీఎంలను భద్రత పరిచిన స్ట్రాంగ్‌ రూములకు భ›ద్రత మరీ తక్కువగా నియమించి ఉండడంవంటి వ్యవహారాలు ఎన్నికల కమిషన్‌ విచారణకు సైతం దారి తీశాయి. ఈ ఎన్నికల  వివాదం అన్నాడీఎంకే – కాంగ్రెస్‌ అభ్యర్థి మధ్య అని చెప్పడం కన్నా, కలెక్టర్‌ అన్భళగన్‌– కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతిమణి మధ్య అన్నట్టుగా మారింది. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో జ్యోతిమణి ఎంపీగా విజయకేతనం ఎగుర వేశారు. అయినా, ఈ ఇద్దరి మధ్య వివాదం సమసినట్టు లేదు. ఇందుకు కారణం, వివాదం మరింతగా ముదిరిందనేందుకు తగ్గట్టుగా కలెక్టర్‌పై జ్యోతి మణి  విరుచుకు పడడం గమనార్హం.

ప్రజాసమస్యలపై ఎవర్ని ఆదేశించాలి..
అరవకురిచ్చి ఎమ్మెల్యే సెంథిల్‌ బాలాజీతో కలిసి ఎంపీ జ్యోతి మణి శని, ఆదివారాల్లో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకున్నారు. అయితే, అధికారులు తన పర్యటనలో కనిపించక పోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జిల్లా కలెక్టర్‌ పనితీరును గుర్తు చేస్తూ, ఏ మేరకు తమకు ఆయన మర్యాదను ఇస్తున్నారో అన్నది తాజాగా స్పష్టం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎంపీగా ఉన్న తనను, ఎమ్మెల్యేగా ఉన్న సెంథిల్‌బాలాజీని తాగు నీటి ఎద్దడిపై జరిగిన సమావేశానికి ఆహ్వానించకపోవడం విచారకరంగా పేర్కొన్నారు. ఎంపీ అన్న కనీస మర్యాద కూడా ఇవ్వక పోగా, తన సెల్‌ నంబర్‌ను కలెక్టర్‌ బ్లాక్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై  కలెక్టర్‌తో చర్చించలేని పరిస్థితి ఉందని, ఆయన పద్ధతి మార్చుకోవాల్సిన  అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో తన సెల్‌ నంబర్‌ బ్లాక్‌ చేసి ఉంటారేమోనని, ఇకనైనా పద్దతి మార్చుకోవాలని, లేని పక్షంలో పార్లమెంట్‌లో కలెక్టర్‌ తీరును ప్రస్తావించక తప్పదని హెచ్చరించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా