-

పెదనాన్న కొడుకే హంతకుడు..

21 May, 2018 08:34 IST|Sakshi
హత్య కేసు వివరాలు తెలుపుతున్న డీఎస్పీ రామారావు.

గుర్తు తెలియని మృతదేహం కేసులో వీడిన మిస్టరీ

హతుడు ఏలేశ్వరానికి చెందిన నగల వ్యాపారి విజయ్‌మార్‌

కేసును ఛేదించిన పోలీసులు  నిందితుల అరెస్టు

నగలు, కారు, బైక్‌ స్వాధీనం

జగ్గంపేట: ఆస్తి కోసం సొంత చిన్నాన కొడుకును  పెట్రోలు పోసి తగులబెట్టి హత్య చేసిన కసాయి, అతడికి సహకరించిన కరుడుగట్టిన హంతకుడిని పోలీసులు జైలుకు పంపారు. మురారి శివారున జాతీయ రహదారిని ఆనుకుని క్రైస్తవ సమాధుల వద్ద ఈనెల 13న సాయంత్రం గుర్తు తెలియని యువకుడి మృత దేహం సగం వరకు కాలి ఉన్నట్టు సమాచారమందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వారం రోజుల వ్యవధిలోని నిందితులను అరెస్టు చేశారు. ఆ కేసుకు సంబంధించి వివరాలను జగ్గంపేట సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌.వి.రామారావు, సీఐ కాశీవిశ్వనాథం వెల్లడించారు. మురారి వద్ద లభించిన మృతదేహం ఏలేశ్వరం గ్రామానికి చెందిన నగల వ్యాపారి మార్కొండు విజయకుమార్‌(27)గా గుర్తించామన్నారు. నగల దుకాణం కోసం కన్నేసిన పెదనాన్న కొడుకు మార్కొండు వెంకటసాయి, పలు హత్య కేసుల్లో నిందితుడు అదే గ్రామానికి చెందిన కొల్లేపర వీర్రాజు అలియాస్‌ గోల్డ్‌రాజా కలిసి హత్య చేశారన్నారు.

నగల షాపు కోసం..
హతుడు విజయ్‌కుమార్‌ చిన్నప్పుడే తండ్రి శేషగిరి చనిపోయాడు. పెదనాన్న జేజీ ప్రసాదరావు చేరదీసి తన బంగారు నగల షాపులో పెట్టుకున్నారు. సుమారు ఆరేళ్ల క్రితం విజయ్‌కుమార్‌కు తన షాపు పక్కనే సొంతంగా నగల షాపును పెదనాన్న ఏర్పాటు చేశాడు. దీంతో విజయ్‌కుమార్‌ సొంతంగా వెండి, బంగారు నగల షాపును నడుపుకొంటూ తల్లికి ఆసరాగా ఉంటున్నాడు. విజయ్‌కుమార్‌కు నగల షాపు ఇవ్వడాన్ని సహించని పెదనాన్న కొడుకు వెంకటసాయి తరచూ అతడితో గొడవ పడేవాడు. తండ్రి, పెద్దల వద్ద తగవు పెట్టి విజయ్‌కుమార్‌ షాపును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. తండ్రి, పెద్దలు విజయ్‌కుమార్‌కు మద్దతుగా ఉండడంతో చేసేది లేక ఎలాగైన విజయ్‌కుమార్‌ను అంతమొందించాలని కక్ష పెంచుకున్నాడు. ఆరు నెలలుగా అన్న హత్యకు పథకం పన్నాడు. ఒకసారి హత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

పక్కా పథకం ప్రకారం..
ఎవరికీ అనుమానం రాకుండా చంపాలని భావించిన వెంకటసాయి గ్రామంలోని గోల్డ్‌ రాజాగా పిలవబడే కొల్లేపర వీర్రాజును ఆశ్రయించాడు. ఇతడు నగల కోసం ప్రాణాలను తీసే క్రూరుడు. రెండు హత్య కేసుల్లో నిందితుడు.  నాలుగు నెలలుగా వీర్రాజుతో పరిచయం పెంచుకున్న వెంకటసాయి రెండు నెలలుగా విజయ్‌కుమార్‌ హత్యకు పథకం పన్నాడు. ఇందుకు సహకరించేందుకు సుమారు రూ.ఐదు లక్షలు వీర్రాజు డిమాండ్‌ చేయగా రూ.మూడు లక్షలు ఇచ్చేందుకు వెంకటసాయి ఒప్పందం కుదుర్చుకుని సగం వరకు ఇచ్చాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ఎలా తరలించాలి?, ఎక్కడికి తరలించాలి? అని ఆలోచించి గ్రామంలోని రిటైర్డ్‌ ఫారెస్టు గార్డు పాత కారు విక్రయానికి ఉన్నట్టు తెలుసుకుని ట్రయల్‌కు తీసుకునేందుకు పథకం పన్నారు. హత్యకు ముందు విజయ్‌కుమార్‌ బలహీనతలను పరిశీలించారు. మద్యం కోసం ఎవరూ పిలిచిన తాగేందుకు వెళ్లే అలవాటు ఉండడంతో దానినే ఆసరాగా తీసుకున్న నిందితులు పక్కా ప్లాన్‌తో హత్యకు పాల్పడ్డారు. ఈనెల 12న ఉదయమే విజయ్‌కుమార్‌ ఇంటికి వెళ్లిన వెంకటసాయి తనతో గోల్డ్‌రాజా ఫ్యామిలీ గొడవ తీర్చేందుకు రావాలని కోరారు.

తల్లి అడ్డుచెప్పినా వినకుండా విజయ్‌కుమార్‌ వెంకటసాయితో వెళ్లాడు. గోల్డ్‌ రాజా ఇంటికి వెళ్లగా ఎవరూ లేకపోవడంతో గ్రామంలోని ఒక చోట మద్యం తాగుతూ కొద్ది సేపు గడిపారు. ఈలోపు నిజంగానే అదే రోజున గోల్డ్‌ రాజా భార్య గొడవ పడి పుట్టిల్లు రాజమహేంద్రవరానికి వెళ్లడంతో అదే అదునుగా చూసుకుని మద్యం బాటిళ్లు తీసుకుని గోల్డ్‌ రాజా ఇంటికి ముగ్గురు వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం రెండు వరకు విజయ్‌కుమార్‌తో ఫుల్‌గా తాగించారు. తరువాత మెడలో తువాలును చుట్టి పీక బిగిసేలా లాగి చంపారు.  విజయ్‌కుమార్‌ ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించుకుని మృతదేహాన్ని అనుమానం రాకుండా తరలించేందుకు ముందుకుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారం ఫారెస్టు గార్డు వద్ద అమ్మకానికి ఉన్న కారును ట్రయల్‌ రన్‌ కోసం తీసుకుని రాత్రి 11గంటల ప్రాంతంలో మృతదేహాన్ని ఏలేశ్వరం నుంచి యర్రవరం మీదుగా కృష్ణవరం టోల్‌గేటు వద్దకు రాకుండా రామవరం వద్ద హైవే ఎక్కి మురారి శివారున క్రిస్టియన్‌ శ్మశాన వాటిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ తమతో తీసుకువచ్చిన రెండు లీటర్ల పెట్రోల్‌ వేసి మంట పెట్టారు. కాలకపోవడంతో రాజానగరం వెళ్లి పెట్రోల్‌ తీసుకొచ్చి కాల్చివేశారు. మంట ఎక్కువగా రావడంతో వెలుతురు తగ్గించేందుకు సమీపంలోని గ్రావెల్‌ను వేశారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అక్కడి నుంచి ఏలేశ్వరం వెళ్లి హతుడి నుంచి తీసుకున్న తాళంతో బంగారు నగల షాపును తెరిచి అందులోని వెండి, బంగారు వస్తువులు తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతహాన్ని పెద్దాపురం మార్చురీలో విజయ్‌కుమార్‌ తల్లి గుర్తించడంతో పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మేరకు దర్యాప్తు ముమ్మరం చేసి ఛేదిచారు. నిందితులు ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.నాలుగు లక్షల విలువైన 65గ్రాముల బంగారు వస్తువులు, ఆరు కేజీల వెండి వస్తువులు, కారు, మోటారు సైకిల్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో సీఐ కాశీవిశ్వనాథం, గండేపల్లి ఎస్సై దుర్గాశ్రీనివాస్, సిబ్బంది కృషి చేశారని ఏలేశ్వరం ఎస్సై సహకరించినట్టు డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు