ఆస్తి కోసమే మేనల్లుడి హత్య

1 Nov, 2018 13:32 IST|Sakshi
రాజశేఖరెడ్డి (ఫైల్‌) కాశిరెడ్డి దాడిలో చనిపోయిన రాజశేఖర్‌రెడ్డి

మేనమామ అరెస్టు

ప్రకాశం ,మర్రిపూడి: ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తిని ఎలాగైనా చేజిక్కించుకుందామనే దురుద్దేశంతో స్వయానా తన అక్క కొడుకునే ఓ వ్యక్తి బరిసేతో పథకం ప్రకారం హతమార్చిన సంఘటన మండలంలోని నిర్మాపురంలో గత నెల 27న జరిగింది. ఎస్‌ఐ వై.శ్రీహరి కథనం ప్రకారం.. నిర్మాపురంలో ముత్తుముల ముసలారెడ్డి, ముత్తుముల కాశిరెడ్డి, పోకల నర్సమ్మలది ఉమ్మడి కుటుంబం. కొన్నేళ్లుగా కలిసి మెలిసి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ముత్తుముల శేషారెడ్డి పెద్ద కుమారుడు ముసలారెడ్డికి ఇంట్లో పెత్తనం చేస్తున్న తన తమ్ముడు కాశిరెడ్డిపై అనుమానం మొదలైంది. తనకు తెలియకుండా నివేశన స్థలాలు, పొలం కొనుగోలు చేయడం, బంగారం కొనుగోలు చేయడం, నగదు లెక్క చెప్పకపోవడంతో ఉమ్మడి కుటుంబ సభ్యుల్లో కలతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు కాశిరెడ్డి దూరంగా ఉంటున్నాడు. కలివిడిగా ఉంటున్న కుటుంబంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి.

ముసలారెడ్డి చెల్లెలు నర్సమ్మ, ఆమె కుమారులు ఇక ఉమ్మడి కుటుంబంలో ఉండలేమని భావించి తమ భూములు తమకు పంచి ఇవ్వమని కాశిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఇదే విషయంలో ఈ నెల 26న గొడవ పెట్టుకుని కొట్టుకున్నారు. అంతా కలిసి తనపైకి వస్తారా, తాను పెత్తనం చేసి దాదాపు 100 ఎకరాలు బ్యారన్‌లు సంపాదిస్తే నన్నే ప్రశ్నిస్తారా.. నన్ను లెక్కలు అడుగుతారా.. ఇలాగైతే భూములు ఎలా తీసుకుంటారో చూస్తా.. అని కాశిరెడ్డి ఓ పథకం ప్రకారం తన అక్క పెద్ద కొడుకు పోకల రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మంచంపై సెల్‌ఫోన్‌ చూస్తుండగా పందులను పొడిచేందుకు ఉపయోగించే పదునైన బరిసెతో విచక్షణా రహితంగా పొడిచాడు. పొదిలి తరలిస్తుండగా రాజశేఖర్‌రెడ్డి (40) మృతిచెందాడు. మేనల్లుడిని బరిసెతో పొడిచేటప్పుడు తనకు ఎలాంటి ప్రమాదం లేకుండా ముందస్తు చర్యగా తలకు హెల్మెట్‌ పెట్టుకుని బరిసెను గుండెల్లో దింపాడు. అడ్డు వచ్చిన వదినపై కూడా దాడి చేశాడు. మృతుడి తమ్ముడు కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న కాశిరెడ్డిని పొదిలి సీఐ శ్రీనివాసరావు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడిని పొదిలి జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట హాజరు పరిచినట్లు ఎస్‌ఐ వై.శ్రీహరి తెలిపారు.

మరిన్ని వార్తలు