విమానం బాత్‌రూంలో దాక్కొని..

23 Jan, 2018 16:07 IST|Sakshi

చికాగో : సాధారణంగా టికెట్‌ లేని ప్రయాణం బస్సుల్లో మాత్రమే ఎప్పుడో ఒకసారి సాధ్యం అవుతుంది. అది కూడా బాగా మొండి ధైర్యం ఉన్నవాళ్లు, తెగించేవాళ్లతోనే సాధ్యం అవుతుంది. అలా ప్రయాణించేటప్పుడు అధికారులకు దొరికితే జైలుపాలు కావాల్సిందే. దీంతో సహజంగా టికెట్‌ లేని ప్రయాణం చేసేందుకు ఏ ఒక్కరు కూడా సాహసం చేయబోరు. అలాంటిది విమానాల్లో అలాంటి ప్రయాణం చేసే ఆలోచన ఎవరైనా చేస్తారా! కానీ, బ్రిటన్‌కు చెందిన మార్లిన్‌ హార్ట్‌మెన్‌ (66) అనే మహిళా అలా చేసింది. తన వద్ద కనీసం పాస్‌పోర్ట్‌, బోర్డింగ్‌ పాస్‌ కూడా లేకుండా నిఘా విభాగాన్ని, అధికారులను దాటుకుని విమానంలో అడుగుపెట్టింది. లోపలికి వెళ్లి బాత్‌ రూంలో దాక్కొని విమానం బయలుదేరిన తర్వాత ఓ ఖాళీ సీటు చూసుకొని అందులో కూర్చుంది.

ఇలా చేయడం ఆమెకు షరా మాములేనట. దాదాపు నాలుగుసార్లు ఆమె ఇలాగే చేసిందట. అయితే, ఈసారి మాత్రం అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఓ హేర్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఆమెను బ్రిటన్‌ కస్టమ్స్‌ అధికారులు హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా గతంలో కూడా ఇలాంటి పనులు చేసినట్లు గుర్తించారు. జనవరి (2018) 14న ఆమెను అదుపులోకి తీసుకొని మూడు రోజులపాటు విచారించి తిరిగి ఆమె వచ్చిన చికాగో ఓ హేర్ ఎయిర్‌పోర్ట్‌కు పంపించారు.

అక్కడి అధికారులు ఆమెను అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. ఇంతకీ ఆమె ఎలా అధికారుల నుంచి తప్పించుకొని విమానంలోకి ప్రవేశించిందని ప్రశ్నించగా నిఘా కెమెరాలను పరిశీలించుకుంటూ తనిఖీ అధికారులను సమీపించే సమయంలో జుట్టుతో తన ముఖాన్ని కవర్‌ చేసుకొని చాలా వేగంగా అడుగులు వేస్తూ వెళ్లిపోయిందట. పెద్దావిడే కావడంతో కచ్చితంగా ఆమె దగ్గర పాస్‌పోర్ట్‌, బోర్డింగ్‌ పాస్‌ ఉంటాయని అధికారులు తనిఖీ చేయకపోవడంతో తాపీగా లండన్‌లో అడుగుపెట్టి తిరిగి చికాగోలో వచ్చి పడింది.

మరిన్ని వార్తలు