శీలాన్ని శంకించి.. ఆపై అంతమొందించి!

1 Jan, 2020 09:21 IST|Sakshi

కటకటాల వెనక్కి భార్య హత్య కేసు నిందితుడు 

24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు

సాక్షి, ఒంగోలు: భార్య శీలాన్ని శంకించిన భర్త..నమ్మకంగా ఆమెను దారుణంగా హత్య చేశాడని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం తన చాంబర్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ కథనం ప్రకారం.. మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు నుంచి పెద్ద కొత్తపల్లి వెళ్లే మార్గంలో సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేపట్టారు. తొలుత మహిళ ముఖం ఉన్న రక్త మరకలు తుడిచి ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్‌ ఆమెను గుర్తించగలగడంతో దర్యాప్తు వేగవంతంగా కొలిక్కి వచ్చింది.

చదవండి: అవ్వ చనిపోయిందంటూ నమ్మించి వివాహితపై లైంగికదాడి

మృతురాలు కరువదికి చెందిన బత్తుల సుమలతగా గుర్తించారు. ఆమెకు అన్న, తమ్ముడు ఉన్నాడు. ఆమెకు త్రోవగుంటకు చెందిన పిచ్చయ్య (వాసు)తో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. చెడు అలవాట్లకు బానిసైన పిచ్చయ్య తొలుత ఐటీసీ కంపెనీకి లారీ డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇటీవల బావమరిది ఆటో కొనివ్వడంతో దాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన సెల్‌ఫోన్‌ చెడిపోయిందంటూ భార్య ఫోను తీసుకుని వినియోగిస్తున్నాడు. సెల్‌లో వాయిస్‌ రికార్డులు విని తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని నమ్మాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి చేరింది. భర్త సైతం ఆమె వద్దకే వెళ్లి ఉంటున్నాడు. దుస్తులు కొనుక్కుందామంటూ నమ్మకంగా ఆటోలో ఆమెను తీసుకుని ఒంగోలు వెళ్లాడు.

అక్కడ దుస్తులు కొనుగోలు చేశారు. అనంతరం పెద్ద కొత్తపల్లిలో డబ్బులు రావాలంటూ భార్యను తీసుకెళ్లి ఆ మార్గంలో ఎవరూ లేరని నిర్థారించుకుని తన వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో నరికేశాడు. భార్యను హత్య చేసిన పిచ్చయ్య అనంతరం వీఆర్‌వో వద్ద లొంగిపోయాడు. నిందితుడి నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన వీఆర్వో అనంతరం ఆయన్ను పోలీసులకు అప్పగించాడు. కేవలం అనుమానంతోనే పిచ్చయ్య తన భార్యను కడతేర్చాడని డీఎస్పీ స్పష్టం చేశారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన ఒంగోలు రూరల్‌ సీఐ సుబ్బారావు, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు ఎస్‌ఐలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అభినందించినట్లు డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు