ఛత్తీస్‌గఢ్‌లో ఓయూ విద్యార్థి అరెస్ట్‌ !

20 Jul, 2019 02:41 IST|Sakshi

మావోలతో సంబంధముందనే అనుమానం

భీమదేవరపల్లి: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన ఉగ్గె భరత్‌ను ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌లో పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో వారు పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఇటీవల కరీంనగర్‌ జిల్లా శాతావాహన యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు స్టడీ టూర్‌ పేరిట ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్లి మావోయిస్టులను కలిసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ స్టడీ టూర్‌లో భరత్‌ సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానించి అతడిపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది. భరత్‌ ఇటీవలే జీవిత ఖైదు అనుభవించి జైలు నుంచి విడుదలైన మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి ఉరఫ్‌ మదన్‌లాల్‌ సోదరుడు ఉగ్గె శేఖర్‌ కుమారుడు కావడం చర్చనీయాంశంగా మారింది. భరత్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీసులు తీసుకెళ్లారా.. లేక ఛత్తీస్‌ఘడ్‌లోనే అరెస్ట్‌ చేశారా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. తమ కుమారుడికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని.. అనవసరంగా పోలీసులు తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని భరత్‌ తండ్రి శేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు