ఎప్పుడూ ఇళ్ల దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లేనా..

25 Aug, 2019 11:56 IST|Sakshi

అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠా అరెస్టు

రూ.19.20 లక్షల విలువైన 10 కార్లు, 3 బైకులు స్వాధీనం

జైలులో కుదిరిన స్నేహం.. బయటకు వచ్చాక ముఠా ఏర్పాటు

‘ఎప్పుడూ ఇళ్ల దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లేనా.. ఈ పంథా మారుద్దాం.. ఇక్కడ భారీ స్థాయిలో కార్లు చోరీ చేసి తమిళనాడు రాష్ట్రానికి మకాం మార్చేసి అక్కడ వాటితో ట్రావెల్స్‌ దందా నిర్వహించి సునాయాసంగా డబ్బు సంపాదించేద్దాం..’ అని పకడ్బందీగా పథక రచన చేసిన ఓ దొంగల ముఠా చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. విజయవాడ భవానీపురం స్టేషన్‌ పోలీసులు ఛేదించిన ఈ కేసు వివరాలను శాంతిభద్రతల విభాగం–2 డీసీపీ సీహెచ్‌ విజయరావు శనివారం మధ్యాహ్నం మీడియాకు వెల్లడించారు.

సాక్షి, అమరావతి : కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన తాతా ప్రసాద్‌ అలియాస్‌ మామిళ్లపల్లి శశిధర్‌ 2008 నుంచి నేర వృత్తికి అలవాటు పడ్డాడు. అతనిపై కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒక కేసులో అరెస్టు అయిన తాతా ప్రసాద్‌ అక్కడ సబ్‌ జైలులో ఉన్న సమయంలో పెదకాకాని పోలీసు స్టేషన్‌ పరిధిలో కారు చోరీ కేసులో అదే జైలుకు వచ్చిన తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌కు చెందిన పెరియస్వామి మారిమత్తుతో పరిచయం ఏర్పడింది. అలాగే తాతా ప్రసాద్‌ తాడేపల్లిగూడెం పరిధిలో చేసిన ఓ నేరానికి రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో అక్కడ విజయవాడ భవానీపురానికి చెందిన నామాల నాగరాజుతో పరిచయం ఏర్పడింది. నామాలపై 7 చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఉన్నాయి. పలుమార్లు జైలుకెళ్లి వచ్చిన తాతా ప్రసాద్‌ కొంత కాలం పాటు చెన్నైలో బీఎండబ్ల్యూ వాహన షోరూంలో మెకానిక్‌గా పని చేశాడు. ఆ సమయంలో కారును డూప్లికేట్‌ తాళంతో ఎలా తీయవచ్చనే దానిపై పట్టు సాధించాడు. 

బయటికొచ్చాక ముఠాగా.. 
వీరు ముగ్గురు నిందితులు జైలు నుంచి బయటకొచ్చాక ఓ ముఠాగా ఏర్పడ్డారు. నామాల నాగరాజు స్నేహితులు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బానావత్‌ సురేష్, కంచికచర్లకు చెందిన దొడ్డకా గోవర్ధన్‌లను తమ ముఠాలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఐదుగురు కలిసి కార్లను దొంగతనం చేయాలని నిర్ణయించారు. గ్రూపులుగా విడిపోయి పగలు, రాత్రి పూట బైక్‌లపై తిరుగుతూ రెక్కీ నిర్వహించాక ఆరుబయట ఉన్న కార్లను బైక్‌లను చోరీ చేశారు. డ్రైవింగ్‌ సీటు వైపున ఉన్న అద్దాలను పగలగొట్టి కార్లను ఎత్తుకెళ్లేవారు. అలాగే బైక్‌ల హ్యాండిల్‌ లాక్‌లను పగులగొట్టి వాటిని దొంగిలించారు. ఇలా విజయవాడలో మూడు కార్లు, ఒక బైకు, చిత్తూరులో మూడు కార్లు, తిరుపతిలో మూడు కార్లు, కృష్ణా జిల్లాలో 2 కార్లు, కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఒక కారు, ఒక బైక్‌ను దొంగలించారు. వీటి మొత్తం విలువ రూ.19.20 లక్షలు. 

మూడు నెలల్లో 13 చోరీలు.. 
ఐదుగురు సభ్యులు గల ఈ ముఠా ఈ ఏడాది మే నెల 5వ తేదీన యానం పోలీసు స్టేషన్‌ పరిధిలో యమహా బైక్‌ను దొంగిలించింది. ఆ తర్వాత అదే నెల 28న విజయవాడ భవానీపురంలో బొలేరో కారును ఎత్తుకెళ్లారు. తర్వాత జూన్‌లో విజయవాడ, చిత్తూరులో రెండు బొలేరో కార్లు, జూలైలో కృష్ణా జిల్లా చిల్లకల్లులో టవేరా కారు,  జగ్గయ్యపేటలో షిఫ్ట్‌ డిజైర్‌ కారు, చిత్తూరు జిల్లా తిరుపతి, వి.కోట, చిత్తూరులో మూడు కార్లు, జగ్గయ్యపేటలో ఒక బైక్, ఆగస్టులో భవానీపురంలో మళ్లీ ఒక కారును, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను చోరీ చేసి పోలీసులకు సవాలు విసిరారు. 

అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించిన పోలీసులు.. 
వరుసగా పోలీసు స్టేషన్‌ పరిధిలో దొంగతనాలు జరుగుతుండటంతో వెస్ట్‌ జోన్‌ ఏసీపీ సుధాకర్‌ నేతృత్వంలో నిఘా పెంచారు. భవానీపురం స్టేషన్‌ సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ కృష్ణబాబు ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ, టవర్‌ డేటా ఆధారంగా తాతా ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల గుట్టు రట్టయ్యింది.

ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహించాలని పథకం.. 
ఇలా దొంగతనం చేసిన కార్లను తమిళనాడులోని దిండిగల్‌ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహించేందుకు ముఠా సభ్యులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా దొంగతనం చేసిన కార్లను తొలుత కొండపల్లి ప్రాంతంలోని పారిశ్రామిక వాడలోని వివిధ రహదారుల పక్కన పార్క్‌ చేసి ఉంచారు. దొంగలు వీటిని తరలించే లోపే పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా రూ.19.20 లక్షల విలువైన 10 కార్లను, మూడు బైక్‌లను దొంగతనం చేసినట్లు అంగీకరించారు. భవానీపురం పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు