ప్రాణం తీసిన ఫోన్‌ కాల్‌

6 Sep, 2018 13:35 IST|Sakshi
సూసైడ్‌నోట్, నాగిరెడ్డి (ఫైల్‌ఫోటో)

అవమానభారంతో     తాత్కాలిక ఉద్యోగి ఆత్మహత్య

పోలీసులే కారణమని     సూసైడ్‌ నోట్‌

చిత్తూరు, పెద్దమండ్యం: పరారీలో ఉన్న జంట చేసిన ఫోన్‌కాల్‌ ఓ తాత్కాలిక ఉద్యోగి ప్రాణం తీసింది. ప్రియుడితో వెళ్లిన మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ పేరుతో తాత్కాలిక ఉద్యోగిని స్టేషన్‌కు పిలిపించారు. దీన్ని అవమానంగా బావించిన అతను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు అనంతపురం జిల్లా 3 వపట్టణ ఎస్‌ఐ కారణమని సూసైడ్‌ నోట్‌ రాశాడు. పోలీసులు, మృతుడు రాసిన సూసైడ్‌ నోట్‌లోని వివరాల ప్రకారం.. పెద్దమండ్యం మండలంలోని శివపురం కస్పాకు చెందిన లక్కం రెడ్డిమల్‌రెడ్డి కొడుకు లక్కం నాగిరెడ్డి అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట బీసీ హాస్టల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గతంలో గాండ్లపెంట, నల్లచెరువు, గుత్తిమండలం ఇసురాళ్లపల్లె, నల్లమాడ మండలాల్లోనూ పనిచేశాడు.

12 ఏళ్ల క్రితం ఇసురాళ్లపల్లె బీసీ హాస్టల్‌లో పనిచేస్తున్న సమయంలో అక్కడ చదువుకున్న విద్యార్థులకు తన ఫోన్‌ నెంబరు ఇచ్చాడు. ఇటీవల అదే ప్రాంతానికి చెందిన వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. మహిళ భర్త అనంతపురం 3వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న వారి సెల్‌ వివరాలను సేకరించారు. వారు బీసీ హాస్టల్‌ అటెండర్‌ లక్కం నాగిరెడ్డి సెల్‌కు ఫోన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నాగిరెడ్డిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. నాగిరెడ్డి సోమవారం సాయంత్రం స్వగ్రామమైన శివపురం వచ్చాడు. తన తప్పు లేకపోయినా పోలీసులు విచారించడాన్ని అవమానంగా భావించాడు. తీవ్ర మనస్తాపం చెంది గ్రామ సమీపంలో చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వివాహితులైన జంట పరారీలో తనకు సంబంధం లేకపోయినా అనంతపురం 3వ పట్టణ ఎస్‌ఐ వేధించాడని పేర్కొంటూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. సంఘటనా స్థలాన్ని పెద్దమండ్యం ఎస్‌ఐ శంకరమల్లయ్య పరిశీలించారు. మృతుడు రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తెలిపారు. నాగిరెడ్డి అనంతపురం జిల్లా వెనుకబడిన తరగతుల హాస్టల్‌ దినసరి వేతన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. మృతునికి భార్య శివకుమారి, కుమారులు భార్గవకుమార్‌రెడ్డి (23), రెడ్డిశేఖరరెడ్డి (20) ఉన్నారు. భార్య శివకుమారి శివపురం అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్తగా పనిచేస్తోంది.

మరిన్ని వార్తలు