ఏ కేసులో ఎంత శిక్షంటే?

7 Feb, 2020 02:06 IST|Sakshi
నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి

బాలిక–1 (కేసు నం.109)
బాలికను కిడ్నాప్‌ చేసి, అత్యాచారం, హత్య చేసిన కేసులో నేరం నిరూపణ కావడంతో.. ఉరి శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. కిడ్నాప్‌ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా. అత్యాచారం కేసులో.. 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ నేరాలకు పోక్సో చట్టం కింద మరో 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

బాలిక –2 (కేసు నం.110)
 బాలిక కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులోనూ ఉరి శిక్ష ఖరారైంది. మరో రూ.2 వేల జరిమానా విధించారు. కిడ్నాప్‌ చేసినందుకు 10 సంవత్సరాల జైలు, రూ.500 జరిమానా విధించారు. అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. పోక్సో చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

బాలిక–3 (కేసు నం.111)
ఈ బాలిక కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష (14 ఏళ్లు) పడింది. కిడ్నాప్‌ కేసులో 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. పోక్సో చట్టం కింద 7 ఏళ్ల జైలు, ఇదే చట్టంలోని సెక్షన్‌–12 కింద మరో 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలన్నీ ఏక కాలంలో అమలవుతా యని జడ్జి తీర్పునిచ్చారు.

హాజీపూర్‌ కేసు డైరీ
2019 ఏప్రిల్‌ 25: హాజీపూర్‌కు చెందిన బాలిక మిస్సింగ్‌ 
ఏప్రిల్‌ 26: హాజీపూర్‌ మర్రిబావి పక్కన బాలిక స్కూల్‌ బ్యాగ్‌ గుర్తింపు. అదే రోజు పక్కనే గల తెట్టేబావిలో మృతదేహం వెలికితీత. 
ఏప్రిల్‌ 27: బాలిక మృతదేహానికి భువనగిరిలో పోస్టుమార్టం.. గ్రామానికి తరలింపు. అదేరోజు బొమ్మలరామారంలో రాస్తారోకో. ఘటనా స్థలాన్ని సందర్శించిన రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌.. సీపీ సమక్షంలో అంత్యక్రియలు. 
ఏప్రిల్‌ 29: నెల కింద తప్పిపోయిన మరో బాలి క మృతదేహం తెట్టెబావి నుంచి వెలికితీత 
ఏప్రిల్‌ 30: మర్రిబావినుంచి ఇంకో బాలిక మృతదేహం అస్తికలు వెలికితీత. 
ఏప్రిల్‌ 30: నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అరెస్టు. జైలుకు తరలింపు 
మే 16, 17: మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష అమలు చేయాలని బొమ్మలరామారంలో బాధిత కుటుంబాల ఆమరణ దీక్ష 
జూలై 31: నల్లగొండలో పోక్సో కోర్టు ఏర్పాటు అక్టోబర్‌ 14: 111వ కేసులో సాక్షుల విచారణ ప్రారంభం. అక్టోబర్‌ 28: 109వ కేసులో సాక్షుల విచారణ..  
నవంబర్‌ 4: 110వ కేసులో సాక్షుల విచారణ 2020 జనవరి 17: సాక్షుల విచారణ పూర్తి జనవరి 27: తీర్పు వాయిదా ఫిబ్రవరి 06: ఉరి, యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తుదితీర్పు .

మృతురాలి సోదరి మీనా ఆనందభాష్పాలు

అమ్మానాన్నలను చూసుకోవాలి

శిక్ష తగ్గించాలని జడ్జిని కోరిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి

సాక్షిప్రతినిధి, నల్లగొండ: హాజీపూర్‌ బాలికల హత్య కేసుల్లో పోక్సో కోర్టు జడ్జి వి.విద్యానాథ్‌ రెడ్డి తీర్పు వెలువరించే ముందు ఒక్కో కేసు వివరాలను ప్రత్యేకంగా వివరించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఆ వివరాలు తెలియజేస్తూ.. అతడి అభిప్రాయాన్ని కోరారు. ఇదంతా మధ్యాహ్నం 2.04 గంటల నుంచి 2.17 గంటల వరకు కొనసాగింది. 
►‘కేసు నంబర్‌ 109లో నువ్వు అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా నేరం రుజువైంది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలన్నీ నువ్వే తప్పు చేసినట్లుగా రుజువు చేస్తున్నాయి. నువ్వు ఏమైనా చెప్పుకుంటావా’అని న్యాయమూర్తి.. శ్రీనివాస్‌రెడ్డిని అడిగారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. అంతా అబద్ధం. పోలీసులే నన్ను కొట్టి ఒప్పించారు’అని శ్రీనివాస్‌రెడ్డి న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. 
►‘కేసు నంబర్‌ 110 విషయంలో.. లిఫ్ట్‌ ఇస్తానని తీసుకెళ్లి అమ్మాయిని అత్యాచారం చేసి, హత్య చేసి బావిలో పాతి పెట్టావు. ఈ నేరం కూడా నువ్వే చేసినట్లుగా రుజువైంది. నువ్వేమైనా చెప్పుకుంటావా..’అని న్యాయమూర్తి మరో బాలిక హత్య విషయంపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని అడిగారు. దీంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి.. ‘నాకు ఏ సంబంధం లేదు, నేను చేయలేదు. మా భూములు లాక్కున్నారు. మా ఇల్లు కూలగొట్టారు. మా అమ్మ, నాన్నలను నేనే చూసుకోవాలి. శిక్ష తగ్గించండి’అంటూ విలపించాడు. 
►‘కేసు నంబర్‌ 111లో.. మరో బాలికను కిడ్నాప్‌ చేసి హత్య చేశావు. ఈ నేరం కూడా నువ్వే చేసినట్లుగా రుజువైంది. దీనికి నువ్వు ఏమైనా చెప్పుకుంటావా’అని న్యాయమూర్తి అడిగారు. దీంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ‘నాకేం తెలియదు. పోలీసులు కొట్టి ఒప్పించారు. మా అమ్మా నాన్నలను నేనే చూసుకోవాలి. మా భూములు లాక్కున్నారు. ఇల్లు కూలగొట్టారు’అంటూ మళ్లీ అదే సమాధానం చెప్పాడు. 
►దీంతో ‘మీ అమ్మానాన్నలు ఎక్కడున్నారో తెలుసా?’అని న్యాయమూర్తి అడిగారు. దీనికి తెలియదు అంటూ నిందితుడు సమాధానం చెప్పాడు. అసలు మీ
అమ్మానాన్నలు బతికే ఉన్నారా అని న్యాయమూర్తి అడగగా.. దానికి కూడా తెలియదు అంటూ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాడు.

శ్రీనివాస్‌రెడ్డిని గురువారం రాత్రి చర్లపల్లి జైలుకు తరలిస్తున్న పోలీసులు

మరిన్ని వార్తలు