పోలీసు భర్తపై ఫిర్యాదు

2 Aug, 2018 12:22 IST|Sakshi
లతామంజుని రాజ్‌కుమార్‌ పెళ్లి చేసుకున్నప్పటి ఫొటోలు

గుట్టుగా రెండో పెళ్లి చేసుకున్నారని ఆరోపణ

సర్వీస్‌ రికార్డుల్లోనూ నామినీ పేరు మార్చేశారు

ఏఎస్పీ రాజ్‌కుమార్‌పై డీజీపీకి తొలి భార్య ఫిర్యాదు

విశాఖ క్రైం: విశాఖపట్నం రూరల్‌ అదనపు ఎస్పీ(క్రైం)గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్‌జే రాజ్‌కుమార్‌ తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకొని తనకు అన్యాయం చేశారని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అతని మొదటి భార్య ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధిత మహిళ లతా మంజు బుధవారం మాట్లాడుతూ 1987లో నమ్మె రాజ్‌కుమార్‌తో తనకు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిందని, కొంతకాలం కాపురం చేసిన తర్వాత గుట్టుగా గంగాభవానీ అనే మహిళను వివాహం చేసుకొని ఇప్పుడు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పుట్టింటికి పంపించేసి ఒంటరి మహిళగా చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై మా నాన్న పలుమార్లు అడిగితే అధికార బలంతో సమాధానమిచ్చేవారనీ, ఇప్పుడు మా తండ్రి కూడా మరణించడంతో అడిగే దిక్కులేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యగా, నామినీగా పోలీస్‌ సర్వీస్‌ రికార్డుల్లో తన పేరుని మార్చి రెండో భార్య పేరుని చేర్చి తనకు తీవ్ర అన్యాయం చేశారనీ, అధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని లతామంజు విజ్ఞప్తి చేశారు. అదనపు ఎస్పీ ఈ నెలలో రిటైర్‌ అవుతుండగా, నామినీగా రెండో భార్య పేరు గంగాభవానీని అక్రమంగా చేర్చిన తీరుని పరిశీలించి తనకు న్యాయం చేయాలని డీజీపీని కోరానని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు