గర్భిణిది హత్య కాదు..

11 Sep, 2019 07:49 IST|Sakshi
మృతురాలు ఎస్తేర్‌రాణి (ఫైల్‌)

అబార్షన్‌ వికటించి యువతితోపాటు బిడ్డ మృతి

పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో విచ్ఛిత్తికి యత్నం

మృతదేహాలను గుట్టుగా తీసుకొచ్చి రంగంపల్లి శివారులో దహనం

మృతురాలు గుల్బర్గావాసి వీడిన కేసు మిస్టరీ

రంగారెడ్డి ,పరిగి: గర్భిణిది హత్య కాదని పోలీసులు విచారణలో తేలింది. ఈనెల 5న పరిగి మండల పరిధిలోని రంగంపల్లి శివారులో గుర్తుతెలియని వ్యక్తులు నిండు గర్భిణితో పాటు బిడ్డ మృతదేహాన్ని కాల్చివేసిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే.  దుండగులు గర్భిణిని హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని పడేసి పెట్రోల్‌తో తగులబెట్టి ఉండొచ్చని అప్పట్లో భావించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మిస్సింగ్‌ కేసుతో మిస్టరీ వీడింది..   
ఈమేరకు పరిగి పోలీసులు మిస్సింగ్‌ కేసులు, సీసీ పుటేజీల సాయంతో విచారణ ప్రారంభించారు. గర్భిణి మృతి వివరాలు పక్క జిల్లాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కూడా అందజేశారు. ఘటన జరిగిన రోజే కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ఓ మిస్సింగ్‌ కేసు నమోదయ్యింది. పరిగి పోలీసుల వివరాలతో అక్కడి పోలీసులు సరిచూసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బ్రహ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ తమ మిస్సింగ్‌ కేసుతో ఇక్కడి వివరాలు చూసుకొని తమ ఠాణా పరిధిలోని కనిపించకుండా పోయిన యువతిగా గుర్తించారు.  

మృతురాలు డిగ్రీ విద్యార్థిని..
మృతురాలిని గల్బర్గాకు చెందిన యువతిగా గుర్తించారు. జయ ప్రభు శ్యామూల్‌ కూతురు ఎస్తేర్‌ రాణి(23)గా నిర్ధారించుకున్నారు. ఆమె గుల్బర్గాలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండేది. ఆమెను ఓ యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించి వంచించడంతో గర్భవతి అయ్యింది. విషయం ఇంట్లో తెలుస్తుందని భావించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించేందుకు యత్నించారు. అబార్షన్‌ వికటించడంతో యువతి మృతి చెందింది. ఆమెతో పాటు శిశువు మృతదేహాన్ని ప్రియుడు ఓ కారులో తీసుకొచ్చి పరిగి మండల పరిధిలోని రంగంపల్లి శివారులో హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారి పక్కన పడేశాడు. మృతదేహాలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. నిందుతుడికి అతని స్నేహితులు కూడా సహకరించినట్లు తెలిసింది. పరిగి పోలీసుల నుంచి సమాచారం అందుకున్న కర్ణాటక పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగు చూసింది. దీంతో కేసును కర్ణాటక గల్బర్గాలోని బ్రహ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు డీఎస్పీ రవీంద్రారెడ్డి వెల్లడించారు.  

మరిన్ని వార్తలు