ఆమె పరిచయమైన తర్వాత మారిపోయాడు

4 Feb, 2019 18:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన కుమారుడికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని రాకేష్‌రెడ్డి తండ్రి ధ్రువీకరించారు. అతడిపై ఎటువంటి కేసులు లేవని చెప్పారు. ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తన కుమారుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాకేష్‌ హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. శిఖా చౌదరి పరిచమైన తర్వాతే తమ కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు. (ఎవరీ రాకేష్‌ రెడ్డి..?)

‘మా అబ్బాయి చాలా మంచోడు. సాయం చేస్తాడు కానీ ప్రాణాలు తీసే రకం కాదు. శిఖా చౌదరి పరిచయం కాకముందు మా దగ్గరే ఉండేవాడు. ఆమె పరిచయం అయిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఇంటికి రావడం కూడా మానేశాడు. ఆమె ఎప్పుడు పరిచయం అయిందో మాకు తెలియదు. శిఖాను నేనెప్పుడూ చూడలేదు. గతంలో మోసం కేసులో అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. జయరాం హత్య కేసులో కావాలనే ఇరికించారు. అసలు అతడికి సంబంధమే లేదు. ఆర్థికంగా మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. జయరాం ఎవరో మాకు తెలియదు. పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయాల’ని రాకేష్‌ తండ్రి అన్నారు.


సీసీకెమెరాకు చిక్కాడు!

రాకేష్‌రెడ్డి మద్యం కొనుగోలు చేసిన వీడియో పోలీసులకు లభించింది. కృష్ణా జిల్లా నందిగామలోని విజయా బార్‌లో రెండు బీరు బాటిళ్లు కొనుగోలు చేసి వెళుతున్న రాకేష్‌రెడ్డి సీసీకెమెరాకు చిక్కాడు. జయరాం మృతదేహం లభ్యమైన కారులోనూ మద్యం సీసాలు లభ్యమైనమైన సంగతి తెలిసింది. మద్యం మత్తులో కారు ప్రమదానికి గురైన జయరాం మృతి చెందినట్టుగా సీన్‌ క్రియేట్‌ చేయడానికి రాకేష్‌ విఫలయత్నం చేసినట్టు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు