మూక్ముడిగా చంపేశారు..

23 Aug, 2019 12:26 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి హత్య కేసులో వీడిన మిస్టరీ

పెన్షన్‌ డబ్బుల కోసమే హత్య

సోషల్‌ మీడియాలో చూసి హత్యకు పథకం

భార్య, కుమారుడు,    కుమార్తె అరెస్ట్‌

నాగోలు: పెన్షన్‌ డబ్బుల కోసం ముకుమ్మడిగా దాడి చేసి తండ్రిని హత్య చేసిన అతడి కుమారుడు, కుమార్తె, భార్యను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం ఎల్‌బీనగర్‌ డీసీపీ కార్యాలయంలో  డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర హింగోలికి చెందిన కిషన్‌ మారుతి(70), గంగాబాయ్‌ దంపతులకు నలుగురు సంతానం. కిషన్‌ మారుతి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సికింద్రాబాద్‌లో గూడ్స్‌ రైలు డ్రైవర్‌గా పనిచేసి, 9 ఏళ్ల క్రితం వాలెంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని, మౌలాలి ఆర్టీసీ కాలనీలోని కృష్ణనగర్‌లో ఉంటున్నాడు. అతడికి వచ్చే రూ. 30 వేల పెన్షన్‌తోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా అతడి మూడో కుమారుడు చాలా ఏళ్ల క్రితమే ఇల్లు విడిచి వెళ్లిపోగా, కిషన్‌ మారుతి భార్య గంగాభాయ్, రెండో కుమారుడు కిషన్‌ సుతర్‌ అలియాస్‌ రాహుల్, చిన్న కుమార్తె ప్రఫుల్ల అలియాస్‌ పప్పితో కలిసి ఉంటున్నారు. వీరందరూ తండ్రికి వచ్చే పెన్షన్‌పైనే ఆధారపడుతూ ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. మద్యానికి బానిసైన కిషన్‌ సతుర్‌ డబ్బుల కోసం తరచూ తండ్రితో గొడవపడేవాడు. కిషన్‌ మారుతికి కూడా మద్యం అలవాటు ఉండటంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. వీరికి తోడు అతడి భార్య గంగాబాయ్‌ పిల్లలను వెనుకేసుకొస్తూ భర్తను నిర్లక్ష్యం చేసేది. ఈ నేపథ్యంలో  కిషన్‌ మారుతిని హత్య చేస్తే అతడి పెన్షన్‌ డబ్బులు తమకే వస్తాయని ఆలోచించిన కుటుంబసభ్యులు అతడిని హత్య చేసేందుకు పథకం పన్నారు.

సోషల్‌ మీడియాలో చూసి...
ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఉమ్మెత్త కాయల ద్వారా మనిషిని చంపవచ్చని తెలుసుకున్న వారు ఉమ్మెత్త కాయలను తీసుకువచ్చి పొడి చేశారు. రెండు రోజుల పాటు కొద్ది మొత్తంలో పొడిని కిషన్‌ మారుతికి అన్నంలో కలిపి పెట్టారు. అయితే ఫలితం లేకపోవడంతో ఈ నెల 15న రాత్రి పెద్ద మొత్తంలో ఉమ్మెత్త కాయల పొడిని కలిపి అతడితో తినిపించారు. అదే రోజు రాత్రి కిషన్‌ రాత్రి చనిపోయినట్లు నిర్ధారించుకున్న వారు మృతదేహాన్ని పూజ గదిలో తీసుకెళ్లి పథకం ప్రకారం ముందుగానే కొనుగోలు చేసిన రెండు కత్తులతో ముక్కలుగా నరికి బకెట్‌లలో నింపారు. మృతదేహాన్ని ఎక్కడైనా దూరంగా పారవేయాలని నిర్ణయించుకున్నా వీలు పడకపోవడంతో   మూడు రోజుల పాటు బకెట్లను ఇంట్లోనే ఉంచారు. 18న ఉదయం మృతదేహాన్ని తరలించేందుకుగాను ఆటో కోసం కిషన్‌ సుతర్‌ బయటకు వెళ్లాడు. అదే సమయంలో దుర్వాసన వస్తుడటంతో స్థానికులు కుటుంబ సభ్యులను నిలదీయడమేగాక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులే కుటుంబసభ్యులే హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో గురువారం నిందితులను అరెస్ట్‌ చేశారు.  సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ సందీప్‌ రావు, ఇన్‌స్పెక్టర్‌  మన్మోహన్, ఎస్సైలు రమేష్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు