అతి వేగం: ఇద్దరు యువకుల మృతి

28 Feb, 2020 08:10 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: అతి వేగం.. మద్యం మత్తు పాతికేళ్లు కూడా నిండని ఇద్దరిని బలిగొనగా.. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీ శివారులో గురువారం వేకువజామున ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంగా వెనుకనుంచి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమినగర్‌కు చెందిన వివేక్‌చంద్ర(20), నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్‌కాలనీకి చెందిన వేముల ప్రణయ్‌కుమార్‌(25), మంచిర్యాలకు చెందిన అంకరి స్వరాజ్, బియ్యాల శివకేశవ మిత్రులు. హైదరాబాద్‌లో ఉంటున్న మరో మిత్రుడి పుట్టిన రోజు గురువారం ఉండటంతో వేడుకలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

బుధవారం రాత్రి వీరు గౌతమినగర్‌లోని వివేక్‌చంద్ర ఇంట్లో కలుసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌ బయల్దేరాలనుకున్నారు. చాలారోజుల తర్వాత కలవడంతో వివేక్‌చంద్ర ఇంట్లోనే అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం సేవించారు. అనంతరం కారులో బయల్దేరి ఉదయం వరకు హైదరాబాద్‌ చేరాలనుకున్నారు. మద్యం మత్తులో ఉండటంతో స్వరాజ్‌ వేగంగా డ్రైవ్‌ చేశాడు. వివేక్‌చంద్ర, ప్రణయ్‌కుమార్, శివకేశవ నిద్రలోకి జారుకున్నారు. వేకువజామున 3:30 గంటలకు కరీంనగర్‌ చేరుకున్నారు. మిత్రులంతా నిద్రలోకి జారుకోవడంతో స్వరాజ్‌ కూడా మద్యం మత్తు కారణంగా నిద్రను ఆపుకుంటూ కారు నడిపాడు. కరీంనగర్‌ నుంచి 20 నిమిషాల్లో తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీకి చేరుకున్నారు.

రెప్పపాటులో.. 
కారు రామకృష్ణకాలనీ దాటుతుండగా డ్రైవ్‌ చేస్తున్న స్వరాజ్‌కు ఒక్కసారిగా లారీ కనిపించడంతో దానిని తప్పించబోయాడు. అప్పటికే 90 కిలోమీటర్ల వేగంతో ఉన్న కారు.. రెప్పపాటులో ఎడమవైపు భాగం లారీని వేగంగా ఢీకొంటూ దూసుకెళ్లి డివైడర్‌ను తాకి ఆగింది. ఈ ప్రమాదంలో కారు ఎడమవైపు ముందుసీట్లో కూర్చున్న వివేక్‌చంద్ర, వెనుక సీట్లో కూర్చున్న ప్రయణ్‌కుమార్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. స్వరాజ్, కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. కారు అతివేగంగా లారీని ఢీకొట్టడంతో లారీ కిందభాగంలో ఉన్న స్టెప్నీ టైర్‌ విరిగిపోయి సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడింది.

ఇరుక్కుపోయిన మృతదేహాలు..
ప్రమాద సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ మహేశ్‌గౌడ్‌ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారులో ఇద్దరు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి వెంటనే 108కు సమాచారం అందించారు. ఇంతలో çకరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వైపు వెళ్తున్న అంబులెన్స్‌ రావడంతో పోలీసులు దానిని ఆపి స్థానికుల సాయంతో అతికష్టంగా క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీశారు. ఇద్దరినీ అంబులెన్స్‌లో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. 

క్షతగాత్రులకు డ్రంకన్‌ డ్రైవ్‌..
కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వరాజ్, శివకేశవ పరిస్థితి మెరుగ్గా ఉందని సీపీ తెలిపారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు వారికి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నిర్వహించగా ఆల్కాహాల్‌ శాతం 87 వచ్చిందని తెలిపారు. ప్రమాదం గురించి క్షతగాత్రులను అడిగితే పొంతన లేని సమాధానం చెప్పారని, మద్యం మత్తు, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. ఎల్‌ఎండీ పోలీసులు పూర్తి విచారణ జరిపి నివేదిక ఇస్తారని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదం ఇరు కుటుంబాల్లో తీరని దుఖాన్ని మిగిల్చిం‍ది. సినిమాకు వెళ్లాస్తా నాన్న అని చెప్పి వెళ్లిన కొడుకు వివేక్‌చంద్ర మృతి చెందాడనే వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలారు. ఊరికి వెళ్తున్న అని చెప్పి వెళ్లిన భర్త ప్రణయ్‌కుమార్‌ తిరిగిరాడని తెలిసి గుండెలు అవిసేలా రోదించింది. మంచిర్యాల పట్టణంలోని గౌతమినగర్‌కు చెందిన కాసారపు రమేష్‌రావు, అనిత దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు వివేక్‌చంద్ర (20). హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజిలో బీటెక్‌ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి సినిమాకు వెళ్తున్నానని చెప్పి రాత్రి 8గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి శవవయ్యాడు.

ఊరెళ్లొస్తానని చెప్పి...
శ్రీరాంపూర్‌ కాలనీకి చెందిన వేముల సారేందర్, లక్ష్మీ దంపతుల పెద్దకుమారుడు ప్రణయ్‌కుమార్‌. తండ్రి ఎస్సార్పీ 3 గనిలో హెడ్‌ ఓవర్‌మెన్‌గా పనిచేసి కారుణ్య ఉద్యోగాల కింద ఆన్‌ఫిట్‌ కావడంతో ఆయన స్థానంలో ప్రణయ్‌కుమార్‌ మే, 2019లో ఉద్యోగంలో చేరాడు. జూలై 2019న పావనితో వివాహమైంది. భార్యతో కలిసి సింగరేణి క్వార్టర్స్‌లో నివాసముంటున్నాడు. బుధవారం రెండో షిఫ్ట్‌కు వెళ్లిన ప్రణయ్‌కుమార్‌ విధులు ముగిసిన అనంతరం రాత్రి 10:40లకు భార్యకు ఫోన్‌ చేసి తాను ఇంటికి రావడం లేదని, ఊరెళ్తున్నాని చెప్పాడు. డ్యూటీ డ్రెస్‌ మీదనే మంచిర్యాలకు వెళ్లి అక్కడ నుంచి స్నేహితులు వివేక్‌ చంద్ర, స్వరాజ్, శివకేశవ్‌లతో కలిసి కారులో బయలుదేరాడు. మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులు బోరునవిలవిుంచారు.  

పరామర్శ...
ప్రణణ్‌కుమార్‌ మృతిచెందిన విషయం తెలుసుకున్న గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ బ్రాంచీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, నాయకులు ముస్కె సమ్మయ్య, బాజీసైదా, కిషన్‌రావులు మృతునికి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రణయ్‌ స్నేహితులు భరత్‌రెడ్డి, అన్వేశ్‌రెడ్డిలు వారికుటుంబ సభ్యులను ఓదార్చారు. 

సినిమాకెళ్లి వస్తాడనుకున్నా
నా కొడుకు ఎవరితోను పెద్దగా స్నేహం చేయడు. ఈ స్నేహితులు నాకు తెలియదు. సినిమాకు వెళ్లస్తానాని చెప్పి వెళ్లిండు. ఉదయం కరీంనగర్‌ నుంచి ఫోన్‌ అచ్చింది. రోడ్డు ప్రమాదంలో నీ కుమారుడు వివేక్‌చంద్ర ఉన్నాడని చెప్పడంతో నమ్మలేకపోయాను. ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదు. సినిమాకు అని వెళ్లిన కొడుకు ఇలా తిరిగివస్తాడనుకోలేదని బోరున విలపించాడు. 
– వివేక్‌ చంద్ర తండ్రి రమేష్‌రావు, మంచిర్యాల 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు