కొత్తపేట ఆర్టీసీ కాలనీలో చోరీ

10 Nov, 2018 10:34 IST|Sakshi
దొంగలు అపహరించింది ఈ బీరువాలోనివే.. దొంగలు విరగ్గొట్టిన ప్రధాన ద్వారం

రూ. 55 వేల విలువ కలిగిన బంగారు, వెండి ఆభరణాలు అపహరణ

రూ. 15,000 నగదు కూడా..

ప్రకాశం, చీరాల రూరల్‌: వేటపాలెం మండలంలోని కొత్తపేటలో దొంగలు హల్‌ చల్‌ చేస్తున్నారు. తాళంవేసిన ప్రతి ఇంటిని లూటీ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. కొత్తపేటలో సంçపన్న వర్గాల వారు ఉండటంతో దొంగలు తమ పని సులభంగా ముగించుకుని వెళుతున్నారు. కొత్తపేట శ్రీనివాస పురంలో భారీచోరీ సంఘటన చోటుచే సుకుని పదిరోజులు కూడా కాకముందే మరో దొంగతనం చోటుచేసుకుంది. ఓ విశ్రాంత ఉద్యోగి ఇంటికి తాళంవేసి ఊరికి వెళ్లగా గమనించిన దొంగలు తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ. 15,000 నగదును దోచుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం కొత్తపేట ఆర్టీసీ కాలనీలో వెలుగు చూసింది.

టూ టౌన్‌ సీఐ రామారావు తెలిపిన వివరాల మేరకు కొత్తపేట ఆర్టీసీ కాలనీలో నివాసముండే విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ఈనెల 3న బెంగళూరులోని తన కుమారుడిని చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఇల్లు గమనిస్తూ ఉండమని పనిమనిషికి చెప్పి వెళ్లారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ఇంటి ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువాలోని రెండు సవర్లు బంగారు కమ్మలు, ఉంగరం, రెండున్నర కేజీల వెండి వస్తువులు, రూ. 15,000 నగదులు అపహరించారు. తలుపులు తెరచి ఉండడంతో పని మనిషి లక్ష్మి ఫోన్‌ ద్వారా రాఘవరావుకు సమాచారాన్ని అందించింది. ఆయన చీరాలకు చేరుకుని టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రామారావు, ఏఎస్సై ఆంజనేయులు సంఘటనా  స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఒంగోలు ఫింగర్‌ ప్రింట్‌ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని వేలి ముద్రలు సేకరించారు.

దొంగలకు వరంగా మారిన కొత్తపేట
కొత్తపేటను దొంగలు తమ విడిదిగా మార్చుకున్నారు.  తాళం వేసిన ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. కొత్తపేటలో సంపన్న వర్గాలవారు నివసించే అపార్టుమెంట్లు, భారీ భవంతులు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండడంతో పాటు ఇంటికి ఇంటికి దూరం అధికంగా ఉంటుంది. ఒకరి ఇంట్లో ఏమి జరుగుతుందో పక్కింటివారికి తెలియదు. ఏమి అలికిడి జరిగినా మన ఇంట్లో కాదుకదా అనే ధోరణిలో గృహ యజమానులు ఉండటంతో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇళ్లు వదిలి ఊరెళ్లే సమయంలో పోలీసు స్టేషన్‌లో సమాచారం అందించాలనే పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తపేటలో చోటుచేసుకున్న రెండు దొంగతనాలు పోలీసు స్టేషన్‌కు కొద్ది దూరంలో ఉండటం గమనార్హం. కొత్తపేటలోనే డీఎస్పీ కార్యాలయం కూడా ఉంది. రాత్రి సమయంలో పోలీసులు నిఘా సక్రమంగా లేదని ప్రజలు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు