అద్దెకు తీసుకుని తాకట్టు పెడతాడు

24 Jan, 2020 08:33 IST|Sakshi

ట్రావెల్స్‌ నిర్వాహకుడి పేరుతో దందా

ఓఎల్‌ఎక్స్‌ యాప్‌ ఆధారంగా మోసాలు

నిందితుడి అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: తేలికపాటి వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలను అద్దెకు తీసుకుంటానంటూ యజమానులను నమ్మించి, అనంతరం వాటిని తాకట్టుపెట్టి జల్సాలు చేస్తున్న కేసులో ఓ యువకుడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్‌ ఓఎల్‌ఎక్స్‌ ఆధారంగా దందాలు చేసినట్లు జాయింట్‌ పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి గురువారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నగరానికి చెందిన దాలె దుర్గాప్రసాద్‌ తన కారును అద్దెకు ఇస్తానంటూ ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. దీనిని చూసిన మహబూబ్‌నగర్‌ జిల్లా, బాలానగర్‌కు చెందిన నానావత్‌ సంతోష్, అతడి బంధువు పథకం ప్రకారం రంగంలోకి దిగారు.

దుర్గాప్రసాద్‌ను సంప్రదించిన వారు వాహనం అద్దెకు కావాలని చెప్పారు. నెలకు రూ.18 వేల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. దుర్గాప్రసాద్‌కు తన ఆధార్‌ కార్డు కాపీ, రెండు ఖాళీ చెక్కులు, రూ.50  బాండ్‌ పేపర్‌పై ష్యూరిటీ ఇచ్చారు. అడ్వాన్స్‌గా రూ.5 వేలు చెల్లించిన నిందితులు వాహనం తీసుకువెళ్లారు. ఆపై మిగిలిన మొత్తం, నెల వారీ అద్దె చెల్లించడం మానేశారు. తనకు రావాల్సిన డబ్బు కోసం దుర్గాప్రసాద్‌ ఫోన్లు చేస్తే బెదిరించడం మొదలెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏటీఎం టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.ఆంజనేయులు నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన ఎస్సై పి.శ్రీనివాసులు తదితరులు నిందితుల్లో ఒకరైన సంతోష్‌ను గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి ఐదు తేలికపాటి వాహనాలు, ఓ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇదే తరహాలో మరో తొమ్మిది మందిని మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలను నిందితులు తాకట్టు పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు