అద్దంలో భద్రత

24 Jan, 2020 08:39 IST|Sakshi

మిర్రర్‌ సిగ్నల్‌ మానోవర్‌ ఎంతో ముఖ్యం

కొద్దిపాటి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు

రోడ్డు క్రాఫ్ట్‌ స్వచ్ఛంద సంస్థ పరిశీలన

రహదారి భద్రతపై డ్రైవర్లకు ప్రత్యేక మార్గదర్శి

సాక్షి, సిటీబ్యూరో: ఏటా వందలకొద్దీ రోడ్డు ప్రమాదాలు..రక్తసిక్తమయ్యే రహదారులు. వెరసీ.. ఎందరో మృత్యుపాలవుతున్నారు. మరెందరో క్షతగాత్రులుగా మారుతున్నారు. నగరంలో ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలుహడలెత్తిస్తున్నాయి. ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డునిబంధనలపై కనీస అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంతోవాహనాలు నడపడమే ఇందుకు ప్రధాన కారణం. బండినడిపేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ప్రమాదాలను సైతం అరికట్టవచ్చని చెబుతోంది నగరానికి చెందిన ‘రోడ్డు క్రాఫ్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ. రోడ్డు భద్రతపై వివిధ రూపాల్లో అవగాహన కలిగిస్తున్న ఆసంస్థ తాజాగా ‘కారు డ్రైవింగ్‌’పాఠాలను బోధించే ఓ ప్రత్యేక మ్యానువల్‌’ను రూపొందించింది. భారత వైమానిక దళంలో పైలట్‌గా పని చేసి, అనంతరం లండన్‌లో పోలీస్‌ అధికారిగా పని చేసిన మాల్కమ్‌ వోల్ఫ్,అమెరికాలోని నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్, మోటార్‌ సైకిల్‌ సేఫ్టీ ఫౌండేషన్‌ సంస్థల నుంచి అడ్వాన్స్‌డ్‌ డ్రైవింగ్‌ సర్టిఫికెట్‌ పొందిన ప్రముఖరోడ్డు భద్రతా నిపుణులు నరేష్‌ రాఘవన్‌లు ‘రోడ్‌ క్రాఫ్ట్‌’ సంస్థను నిర్వహిస్తున్నారు. ‘అమెరికా, బ్రిటన్, దుబాయ్‌ వంటి దేశాల్లో ఉన్నట్లుగానే పటిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా మన వద్ద 78 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అద్దంలో చూసుకోండి..
‘సాధారణంగా రోడ్డు భద్రత అనగానే సీట్‌బెల్ట్, హెల్మెట్‌ ధరిస్తే చాలుననే  అభిప్రాయం ఉంది. మంచిదే. ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాలను కాపాడేందుకు అవి ఉపయోగపడతాయి. కానీ అసలు ప్రమాదమే జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది చాలా ముఖ్యం’ అంటున్నారు నరేష్‌ రాఘవన్‌. ‘రహదారి భద్రతలో అద్దం (మిర్రర్‌) కూడా ఎంతో ముఖ్యమైనది. పార్కింగ్‌ నుంచి బండి బయటకు తీసేటప్పుడు, రోడ్డుపై టర్నింగ్‌  సమయంలో, ఒక లేన్‌ నుంచి మరో లేన్‌లోకి మారేటప్పుడు మిర్రర్‌ సిగ్నల్‌ మానోవర్‌ (ఎంఎస్‌ఎం) పాటించాలి. రేర్‌ వ్యూ మిర్రర్‌లో వెనుక వాహనాల కదలికలను గమనిస్తూ ముందుకు వెళ్లాలి.  చాలామంది ఇది పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.’ అన్నారు.

వేగ పరిమితి బండికే కాదు..డ్రైవర్‌కు కూడా అవసరమే..
ఇటీవల బయోడైవర్సిటీ ఫ్లైఓర్‌పై  జరిగిన ప్రమాదంలో అపరిమిత వేగమే కారణమని పోలీసులు తేల్చారు. వాహన వేగాన్ని అదుపు చేయలేని డ్రైవింగ్‌ ఇందుకు కారణం. బండి వేగాన్ని నియంత్రించే సామర్థ్యం డ్రైవర్‌కు ఉండాలి. ఇందుకోసం డ్రైవర్‌ సమర్థత, వాహనం వేగం మధ్య బ్యాలెన్సింగ్‌ అవసరం. డ్రైవర్‌ వయసు, అనుభవంపై కూడా వాహనం వేగం ఆధారపడి ఉంటుంది. 

2 సెకన్ల దూరం..
ప్రతి రెండు వాహనాల మధ్య ఎంత దూరం ఉండాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 50 నుంచి 100 ఫీట్ల దూరం (గ్యాప్‌) ఉంటే చాలనుకుంటారు. కానీ ఒక వాహనానికి మరో వాహనానికి కనీసం 2 సెకన్ల ప్రయాణ దూరం ఉండాలి.‘వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారు 2 సెకన్ల వ్యవధి వల్ల 180 ఫీట్ల దూరంలో ఉంటుంది. ఇది పూర్తిగా సురక్షితమైన నిబంధన’ అని చెబుతున్నారు

మాల్కం వోల్ఫ్‌..లేన్‌ క్రమశిక్షణ..
అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో  లేన్‌ నిబంధన  కచ్చితంగా పాటిస్తారు. మోటారు వాహనాలు కుడి లేన్‌లో, ద్విక్రవాహనాలు ఎడమ లేన్‌లో వెళితే  ప్రమాదాలకు అవకాశం తక్కువ. కానీ ఇష్టారాజ్యంగా లేన్‌ నిబంధన అతిక్రమించడం వల్ల  ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్‌క్రాప్ట్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
లేన్‌ నిబంధనపై అవగాహన కల్పించేందుకు అన్ని చోట్ల సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలి.
ఏ అంతర్జాతీయ నగరంలో లేని విధంగా నగరంలో హాంకింగ్‌ (హారన్ల మోత) ఉంది. సిటీలో ఆర్టీసీ బస్సులు, కార్లు, రవాణా వాహనాలు హారన్ల మోత మోగిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి.  

మ్యానువల్‌పైఅవగాహన ఉండాలి  
హైదరాబాద్‌లో 30 ఏళ్లుగా డ్రైవింగ్‌ చేస్తున్న వాళ్లపై కూడా అధ్యయనం చేశాం. కానీ వారికి రోడ్డు నిబంధనలపై కనీస అవగాహన ఉండడం లేదు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణం మిగతా వాహనదారులే అని చెబుతారు. అలా ప్రతి ఒక్కరు తప్పించుకుంటారు. ఈ నిర్లక్ష్యమే అసలైన ప్రమాదం.– నరేష్‌ రాఘవన్, రోడ్డు భద్రతా నిపుణులు

మర్యాదపూర్వకంగా నడపాలి
నగరంలో ర్యాష్‌ డ్రైవింగ్‌ చాలా ఆందోళన కలిగిస్తోంది. రోడ్డెక్కితే చాలు ఏ వాహనంఢీకొంటుందోనని భయమేస్తోంది. డ్రైవర్‌లకు పాఠాలను బోధించేందుకే  మేం ఈ మ్యానువల్‌ను తెలుగులో రూపొందించాం. ప్రతి డ్రైవర్‌ దీన్ని చదివి పాటిస్తే 70 శాతానికిపైగా ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి.  – మాల్కమ్‌ వోల్ఫ్,రోడ్‌క్రాఫ్ట్‌ వ్యవస్థాపకులు

మరిన్ని వార్తలు