మనిషికాదు మానవ మృగం

1 May, 2019 02:49 IST|Sakshi
నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి

ఒక్కొక్కటిగా బయటపడుతున్న శ్రీనివాస్‌ దారుణాలు 

2015లోనే విద్యార్థిని కల్పనపై అత్యాచారం, హత్యతో మొదలు 

ఈ కేసు ఛేదించలేక చేతులెత్తేసిన పోలీసులు 

2017లో కర్నూలులో మహిళను చంపి కాల్వలో పడేసిన కేసు 

ఈ నేరంతోనే మర్రి శ్రీనివాస్‌రెడ్డి నేరచరిత్ర వెలుగులోకి 

డ్రగ్స్, మద్యానికి బానిస.. మహిళలపై లైంగిక వేధింపులు

సాక్షి, హైదరాబాద్‌/యాదాద్రి: బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో వెలుగుచూసిన సీరియల్‌ హత్యలకు నాలుగేళ్ల కిందే బీజం పడింది. సాధారణ మెకానిక్‌లా బయటికి కనిపించే శ్రీనివాసరెడ్డిలో ఇంతటి క్రూరమైన నరరూప రాక్షసుడు దాగున్నాడన్న విషయం తెలిసి గ్రామస్తులే ఆశ్చర్యపోతున్నారు. శ్రీనివాసరెడ్డి వ్యక్తిత్వం మొదట్లో అంత అనుమానాస్పదంగా ఉండేది కాదు. కానీ.. కొన్నేళ్లుగా అతని వ్యక్తిత్వంలో మార్పులు వచ్చాయి. డ్రగ్స్‌కు బానిసైన శ్రీనివాసరెడ్డి సెక్స్‌ అడిక్ట్‌గానూ మారాడు. నాలుగేళ్ల క్రితం కల్పన అనే అమ్మాయిని చంపేశాడు. ఆ తర్వాత వరుసగా హత్యలకు పాల్పడుతున్నాడని సమాచారం. మేనత్త ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న కల్పన అనే చిన్నారిపై అత్యాచారం జరిపి ఇదే బావిలో పూడ్చిపెట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా బావిలో లభించిన ఎముకలకు డీఎన్‌ఏ టెస్టు ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకోనున్నారు. 

సరిగా దర్యాప్తు చేయని పోలీసులు 
2015 ఏప్రిల్‌లో కల్పన(11) మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. మూడేళ్లపాటు దర్యాప్తు చేసిన తరువాత ఈ కేసును ఇటీవలే మూసేశారు. ఇది శ్రీనివాస్‌ రెడ్డిలో మృగాన్ని రాక్షసుడిగా మార్చింది. ఆ కేసులో సాక్ష్యాధారాల సేకరణలో పోలీసులు విఫలమవడంతో శ్రీనివాస్‌రెడ్డి తన నేరాలను కర్నూలుకు విస్తరించాడు. లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేస్తూ.. మత్తుపానీయాలకు బానిసయ్యాడు. కర్నూలులో అద్దె ఇంట్లో ఉంటూ ఓ మహిళను తన గదికి తీసుకువచ్చి ఆమెపై అత్యాచారం చేసి చంపి కాలువలో పడేశాడు. ఆ తర్వాత హాజీపూర్‌కు పారిపోయి వచ్చాడు. దీనిపై విచారణ చేపట్టిన కర్నూలు పోలీసులు శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసినా.. కల్పన విషయం పసిగట్ట లేకపోయారు. బెయిల్‌పై వచ్చాక కూడా హైదరాబాద్‌లో లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేశాడు. ఈ పనులు చేస్తున్న క్రమంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తోటి మెకానిక్‌లు అతన్ని పనిలోంచి తొలగించారు. దీంతో అప్పుడప్పుడు పనికి వెళ్తూ.. ఎక్కువ సమయం ఇంటివద్దే ఉంటున్నాడు. శ్రీనివాస్‌రెడ్డికి తల్లిదండ్రులతోపాటు సోదరుడు ఉన్నాడు. గ్రామంలోనూ మహిళలను లైంగికంగా వేధించడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అదే బావి వద్ద పలుమార్లు శ్రీనివాస్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. 

తాళం చెవి మరిచానని చెప్పి! 
మహిళలను వేధించినందుకు.. గ్రామస్తులు దేహశుద్ధి చేస్తుండటంతో శ్రీనివాస్‌రెడ్డి తిరిగి తన పాత విధానానికే మొగ్గు చూపాడు. బొమ్మల రామారం–హాజీపూర్‌ రోడ్డు పక్కనే గుబురు చెట్ల నడుమ రెండు పాడుబడిన వ్యవసాయ బావులున్నాయి. అప్పుడప్పుడు తిరిగే ఆటోలు, ద్విచక్రవాహనాలు, కాలిబాటన వెళ్లే కొద్దిపాటి జనం, ఎప్పుడోగాని రాని ఆర్టీసీ బస్‌లు ఇలాంటి రోడ్డు పక్కన నిర్మానుష్యంగా గుబురు చెట్లపొదల్లో గల వ్యవసాయ బావులను ఆ కిరాతకుడు తన అఘాయిత్యాలకు అడ్డాగా ఎంచుకున్నాడు. బొమ్మలరామారం నుంచి హాజీపూర్, మైసిరెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లడానికి బస్సులకోసం ఎదురు చూసే బాలికలను టార్గెట్‌ చేసి తన బైక్‌పై ఎక్కించుకుంటాడు. మార్గమధ్యంలో వ్యవసాయ బావి వద్దకు రాగానే.. ఇంటి తాళంచెవి బావి దగ్గర ఉందని బైక్‌ను ప్రధాన రోడ్డునుంచి దారి మళ్లిస్తాడు. గుబురు చెట్ల మధ్యన గల బావుల వద్దకు రాగానే.. నువ్వంటే నాకిష్టమని తనకు సహకరించాలని మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తాడు. వ్యతిరేకించినవారిని బావిలోకి తోస్తాడు. బావిలో పడి తీవ్రగాయాలైన వారిపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేస్తాడు. మృతదేహాన్ని అక్కడే బావి లో పూడ్చి పెడతాడు. ఎవరికి అనుమానం రాకుండా వారి బ్యాగులను బావిలో విసిరేసి ఊర్లోకి వెళ్తాడు.  

మరింత లోతుగా దర్యాప్తు 
ఈ కేసు నేపథ్యంలో ఏసీపీ భుజంగరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. కేవలం హాజీపూర్‌ గ్రామస్తులేనా? లేక ఇతరులనూ కూడా ఈ బావి వద్దకు తీసుకువచ్చి చంపాడా? అన్న విషయాలు తేలాల్సి ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఏమైనా బాలికలు, మహిళల మిస్సింగ్‌ కేసులపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికల అత్యాచారం హత్యలో స్కూల్‌ బ్యాగులే నిందితుడిని పట్టించాయి. శ్రావణి స్కూల్‌ బ్యాగ్‌ బావిలో గుర్తించడంతో అనుమానం కలిగి గ్రామస్తులు బావిలోకి దిగి వెతకడంతో శ్రావణి మృతదేహం బయటపడింది. దీంతో పోలీస్‌లు చేపట్టిన విచారణలో శ్రీనివాస్‌రెడ్డి నిజాలు ఒక్కొక్కటి చెప్పడంతో మనీషా, కల్పన మృతదేహాలు బయటపడ్డాయి. 

మత్తు, జాప్యం వల్లే దొరికాడు?
పక్కా పథకం ప్రకారం.. మార్చి 9న మనీషాను తన బైకుపై (లిఫ్ట్‌ ఇస్తానని) కీసర నుంచి హాజీపూర్‌కు తీసుకొచ్చే క్రమంలో బండి ఎక్కిం చుకున్నాడు. అక్కడ బైకు నిలిపి, మనీషాను బావిలో తోశాడు. తరువాత బావిలోకి దిగి అపస్మారక స్థితిలో ఉన్న మనీషాపై అత్యాచారం చేసి చంపి పాతిపెట్టాడు. అయితే, మనీషా (17) విషయంలో శ్రీనివాసరెడ్డి చాలా జాగ్రత్తగా మృతదేహాన్ని ఆ బావిలోనే అక్కడే పూడ్చడం, ఆమె తల్లిదండ్రులు మనీషా అదృశ్యంపై ఫిర్యాదు చేయకపోవడం నిందితుడికి కలిసొచ్చింది. ఏప్రిల్‌ 25న శ్రావణి(14)ని కూడా అదేవిధంగా పొట్టనబెట్టుకున్నాడు. కానీ, ఆరోజు అతిగా మద్యం సేవించడం.. హత్య ముగిసేసరికి తెల్లవారడంతో ఆమెను పాతిపెట్టలేకపోయాడు. తీరిగ్గా వచ్చిపాతిపెడదామనుకున్నాడు. కానీ, ఉదయం గ్రామంలోకి చేరుకునేసరికి, అంతా శ్రావణి కోసం వెతకడం, అనూహ్యంగా బావిలో శవాన్ని గుర్తించడం చకచకా జరిగిపోయాయి. శ్రావణి మృతదేహాన్ని తీస్తుంటే శ్రీనివాస్‌రెడ్డి తనకేం తెలియనట్లుగా చూశాడు. 

శ్రీనివాస్‌ రెడ్డి చేసిన అత్యాచారం, హత్య దారుణాలివే! 
1. 2015లో 6వ తరగతి విద్యార్థిని కల్పనపై...
2. అదే ఏడాది మైసిరెడ్డిపల్లి గ్రామంలో వివాహితపై అత్యాచార యత్నం 
3. 2016లో కర్నూలులో మహిళపై...
4. 2019 మార్చిలో డిగ్రీ విద్యార్థిని మనీషాపై... 
5. 2019 ఏప్రిల్‌లో 9వ తరగతి విద్యార్థిని శ్రావణిపై...

మరిన్ని వార్తలు