మొక్కు తీరకుండానే మృత్యుఒడికి..

21 Sep, 2019 08:01 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఓమ్ని వ్యాను

లారీని ఓమ్నీవ్యాన్‌ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం

మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు

వారు పెందుర్తి మండలం రాంపురం, ములగాడ వాసులు

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల వద్ద దుర్ఘటన

సాక్షి ప్రతినిధి, ఏలూరు/నల్లజర్ల/పెందుర్తి:  అతివేగం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించలేక వేగంగా ఢీకొట్టడంతో ఒకే కుటుంబంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఐదుగురు తీవ్ర గాయాలతో తాడేపల్లిగూడెం, ఏలూరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చిన్న మనవడి పుట్టువెంట్రుకలు వెంకన్నకు సమర్పించేందుకు విశాఖ జిల్లా పెందుర్తి నుంచి తిరుపతికి బయలుదేరిన కుటుంబం నల్లజర్ల చేరుకునే సరికి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురంలో నివాసం ఉంటున్న తమ్మిన నీలకంఠరావు, లక్ష్మి దంపతులు, పెద్ద కుమార్తె రమాదేవి భర్త రామకృష్ణ, కుమార్తె తనూజ, గాజువాక ఆర్టీసీ డిపో సమీప ములగాడ హౌసింగ్‌ కాలనీలో నివాసం ఉంటున్న చిన్న కుమార్తె భర్త అప్పలరాజు, కుమారుడు జ్ఞానేశ్వర్‌ మృత్యువాత పడ్డారు. వీరంతా తీర్థయాత్ర కోసం ‘ఓమ్ని’ వాహనంలో బయలుదేరి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది.

రెక్కల కష్టంతో స్థిరపడుతుండగా...
నిరుపేద కుటుంబానికి చెందిన నీలకంఠరావు, లక్ష్మి దంపతులు 30 ఏళ్ల క్రితం విజయనగరం జిల్లా బల్లలవలస నుంచి గాజువాక ప్రాంతా నికి వచ్చి నివాసం ఉంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు రమాదేవి, నీలిమ, కుమారుడు మణికంఠ ఉన్నారు. రమాదేవి, నీలిమలకు పెళ్లి చేసిన తరువాత నీలకంఠం దంపతులు దాదాపు ఆరేళ్ల క్రితం పెందుర్తి మండలం రాంపురం వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం రమాదేవి కుటుం బాన్ని కూడా రాంపురం తీసుకువచ్చేశారు. నీలకంఠం దంపతులు స్థానికంగా రిటైల్‌ బియ్యం వ్యాపారం చేస్తుండగా రమాదేవి, రామకృష్ణ దంపతులు సోడాలు, సాయంత్రం పూట చిరు తినుబండారాల వ్యాపారం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చిన్న మనవడి పుట్టు వెంట్రుకలు కూడా వెంకన్నకు సమర్పిద్దామని సంకల్పించారు. ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇద్దరు కుమార్తెల కుటుంబాలతో కలిసి యాత్రకు బయలుదేరారు. గురువారం రాత్రి అన్నవరంలో సత్యనారాయణస్వామిని సందర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం బయలుదేరి ద్వారకాతిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత విజయవాడ, తిరుపతి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. ఆ దంపతులు సహా ఇద్దరు కుమార్తెల ఐదోతనాన్ని ప్రమాదం బలిగొంది. ఇద్దరు మనవళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది.

మొక్కు చెల్లించుకునేందుకుబయలుదేరి...
చాన్నాళ్లుగా మొక్కులు ఉండడంతో పాటు చిన్న కుమార్తె కొడుకు జ్ఞానేశ్వర్‌కు 9 నెలల వయసు రావడంతో తిరుపతిలో పుట్టు వెంట్రుకలు తీయాలన్న ఆలోచనతో తీర్థయాత్రకు ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం నీలకంఠం, లక్ష్మి, రమాదేవి, రామకృష్ణ, నీలిమ, అప్పలరాజు దంపతులతో పాటు పిల్లలు తనూజ, రేష్మ, యశ్విన్, జ్ఞానేశ్వర్, నీలకంఠం కుమారుడు మణికంఠతో కలిసి మొత్తం 11 మంది అన్నవరం చేరుకున్నారు. రాత్రి అక్కడే నిద్రించి శుక్రవారం వేకువజామున సత్యనారాయణస్వామి దర్శ నం చేసుకుని అనంతరం తిరుపతి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం నల్లజర్ల వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో నీలకంఠం, లక్ష్మి, రామకృష్ణ, అప్పలరాజు, తనూజ, జ్ఞానేశ్వర్‌ దుర్మరణం చెందారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు. ప్రమాదం జరిగిన తర్వాత లక్ష్మిని బయటకు తీసిన తర్వాత కొద్దిసేపు బాగానే ఉన్నా తర్వాత కుటుంబ సభ్యుల పరిస్థితి చూసి షాక్‌తో కుప్పకూలిపోయి ప్రాణాలు కొల్పోయింది. నల్లజర్ల ఆసుపత్రిలో తనూజ, జ్ఞానేశ్వర్‌ మృతి చెందగా, ఏలూరు తరలిస్తుండగా అప్పలరాజు, రామకృష్ణ మృతి చెందారు. నీలిమను తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది.

 స్పందించిన ఎమ్మెల్యేలు..
నల్లజర్ల ప్రమాద సమాచారం తెలియగానే పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. వెంటనే పశ్చిమగోదావరి ఉన్నతాధికారులతో ఫోన్‌లో సంప్రదించి ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, సొసైటీ అధ్యక్షుడు కారుమంచి రమేష్, తహసీల్దార్‌ కనకదుర్గ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
నల్లజర్లలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారన్న విషయం తెలియగానే ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్, కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ వి.రవికుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై వి.చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం
మల్కాపురం(విశాఖ పశ్చిమ): జీవీఎంసీ 47వ వార్డు ములగాడ హౌసింగ్‌ కాలనీ ప్రాంతానికి చెందిన పలుకూరి అప్పలరాజు(36), భార్య నీలిమ(31)లకు మూడున్నరేళ్ల యశ్విన్, 9 నెలల జ్ఞానేశ్వర్‌ సంతానం. చిన్నకుమారుడు జ్ఞానేశ్వర్‌కు పుట్టుతల తీయించడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తూ ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో చిన్న కుమారుడు జ్ఞానేశ్వర్‌తోపాటు అప్పలరాజు మృతిచెందడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. గాజువాకలో హోల్‌సేల్‌గా అప్పలరాజు కొబ్బరిబొండాలు కొనుక్కుని వాటిని తోపుడు బండిపై మల్కాపురం ప్రాంతంలో అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు అప్పలరాజు ప్రమాదంలో మృతి చెందటంతో భార్య, మరో కుమారుడు దిక్కులేని వారయ్యారు. విషయం తెలుసుకున్న బంధవులు ప్రమాద స్థలానికి తరలివెళ్లారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా