గూగుల్‌లో సీఐ నెంబర్‌ కనుక్కొని వీడియోలు పంపి

13 Jan, 2020 08:40 IST|Sakshi
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విశాల్‌

సకాలంలో రక్షించిన గుత్తి సీఐ

సాక్షి, గుత్తి రూరల్‌: ‘అన్న నన్ను క్షమించండి.. ఏమి చేయాలో నాకు అర్థమవడం లేదు. మిమ్మల్ని మోసం చేయాలని కాదు.. నేను బతుకుతానో లేదో తెలియదు.. నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.. నన్ను క్షమించండి’ అంటూ నోటి నుంచి నురగలు కక్కుకుంటూ వీడియో తీసి శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని గుత్తి సీఐ రాజశేఖర్‌రెడ్డి రక్షించారు. కర్నూలు పాత బస్టాండు ప్రాంతానికి చెందిన జంగం కన్నప్ప కుమారుడు జంగం విశాల్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతడిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కర్నూలు నుంచి అనంతపురానికి ద్విచక్రవాహనంలో వెళ్తూ గుత్తి మండలం కొత్తపేట వద్ద ఆగాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి సోదరుడు నందకు వాట్సాప్‌లో పంపాడు. వీడియో చూసిన నంద వెంటనే గూగుల్‌ ద్వారా గుత్తి సీఐ రాజశేఖర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ నంబర్‌ కనుక్కొని వీడియోలు పంపి సమాచారం అందించాడు.

వెంటనే సీఐ తన సిబ్బందితో కలసి కొత్తపేట శివారులో 44వ నంబర్‌ జాతీయ రహదారికి రెండు వైపులా గాలింపు చర్యలు చేపట్టారు. కొత్తపేట గ్రామానికి సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న విశాల్‌ను గుర్తించి వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపారు. విశాల్‌ ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు సీఐ తెలిపారు. సకాలంలో నిండు ప్రాణాన్ని కాపాడి పోలీసులపై గౌరవాన్ని పెంచిన సీఐ రాజశేఖర్‌రెడ్డిని పట్టణ ప్రజలు అభినందించారు.    

మరిన్ని వార్తలు