మా వాళ్లెలా మాట్లాడారు?

1 Nov, 2017 12:55 IST|Sakshi

ఎస్పీ కార్యాలయం నుంచి ఆరా తీస్తున్న సిబ్బంది

ఫిర్యాదుదారులకు నేరుగా ఫోన్‌

బాధితులకు భరోసా..

సిబ్బందిలో మార్పునకు నూతన కార్యక్రమం

బాధ్యతలు స్వీకరించిన రెండో రోజు నుంచే

అమలుచేస్తున్న ఎస్పీ అనురాధ

ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అన్యాయం, అక్రమాలు లేదా దొంగతనాలు జరిగితే చెప్పుకుందామని ఎంతో ఆవేదనతో పోలీసుస్టేషన్లకు వస్తారు. అలాంటి వారు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు వారికి సాంత్వన చేకూరేలా నూతన విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ విధానంతో హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి నేరుగా ఫిర్యాదుదారులతో మాట్లాడుతుండడంతో ఎక్కడైనా పోలీసుస్టేషన్లలో లోటుపాట్లు ఉంటే తెలుస్తోంది. ఈ విషయాన్ని సిబ్బందికి చెబుతూ అప్రమత్తం చేస్తున్నాం. తద్వారా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. – బి.అనురాధ, ఎస్పీ

మహబూబ్‌నగర్‌ క్రైం:  పోలీసుస్టేషన్‌ పేరు వింటేనే గుండెల్లో దడ.. పోలీసు యూనిఫాంలో ఉన్న వారిని చూడగానే కాళ్లలో వణుకు.. తప్పనిసరైతే, ఇంకేం చేయలేని పరిస్థితుల్లో మాత్రమే సాధారణ పౌరులు పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కుతారు. పోలీసుల్లో కొందరు సిబ్బంది వ్యవహార శైలి, మాట తీరుతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గుండెలు చేతపట్టుకుని లోపలకు వెళ్లి.. ఫిర్యాదు ఇచ్చేసి బయటపడడమే! కానీ ఆ ఫిర్యాదు ఎంత వరకు వచ్చింది, విచారణ జరుగుతోందా, లేదా అనే వివరాలు ఆరా తీయాలంటే మళ్లీ పెద్ద తతంగం. అయితే, కొంతకాలంగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. దీనిని మరింత మెరుగపరిచేందుకు మహబూబ్‌నగర్‌ ఎస్పీగా కొన్నినెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన అనురాధ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఫిర్యాదుతో పాటు ఫోన్‌ నంబర్‌
పోలీసుస్టేషన్‌కు వెళ్లే ప్రతీ ఫిర్యాదుదారుడి నుంచి అక్కడి సిబ్బంది ఫోన్‌ నంబర్‌ సేకరిస్తున్నారు. ఆ తర్వాత కేసు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే ఎస్పీ కార్యాలయానికి వివరాలు వెళ్తున్నాయి. అక్కడి సిబ్బంది ఫిర్యాదుదారుడికి ఫోన్‌ చేసి వివరాలు ఆరా తీస్తున్నారు. ‘మీరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో సిబ్బంది ఎలా ప్రవర్తించారు.. మీ ఫిర్యాదు పట్ల బాగా స్పందించారా.. స్టేషన్‌కు ఎప్పు డు వెళ్తే ఎంత సేపటి తర్వాత మాట్లాడారు.. సిబ్బంది మాట్లాడారా లేకుంటే ఎస్‌ఐ లేదా సీఐ మాట్లాడారా.. ఎవరైనా సిబ్బంది డబ్బు అడిగారా’ అంటూ వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఎస్పీ కార్యాలయం నుంచి నేరుగా ఫిర్యాదుదారులకు ఫోన్లు వస్తుండడంతో చాలా వరకు పీఎస్‌ల్లో పనితీరు మెరుగవుతుందని చెబుతున్నారు. ఇక ఎస్పీ అనురాధ బాధ్యతలు స్వీకరించాక రెండో రోజునే ఫిర్యాదుదారులతో మాట్లాడానికి ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అక్కడి సిబ్బంది ఫిర్యాదుదారులకు ఫోన్‌ చేసి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

తక్షణం స్పందన
ఠాణాలకు వచ్చే వారి విలువైన సమయాన్ని కాపాడేందుకు ఎస్పీ ప్రారంభించిన కార్యక్రమం ఉపయోగపడుతోంది. ఫిర్యాదుదారు వచ్చే సరికి సంబంధిత అధికారి లేకపోవడం, ఇన్‌స్పెక్టర్‌కు విషయం చెబుతామనుకుంటే.. ఇంకా రాలేదన్న సమాధానమే ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. ఎస్సైలు, కానిస్టేబుళ్లు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి, వెళ్లడం.. బాధితుల ఫిర్యాదులు స్వీకరించే పరిస్థితి లేకపోవడం కనిపించేది. దీంతో ఫిర్యాదుదారులు గంటల తరబడి వేచి ఉండేవారు. ప్రస్తుత విధానంతో ఎవరైనా సమస్య చెప్పుకొనేందుకు వస్తే.. ఇన్‌స్పెక్టర్‌ నుంచి కానిస్టేబుల్‌ వరకు ఎవరో ఒకరు వెంటనే మాట్లాడి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు