టూర్‌కు పంపించలేదని..

24 Mar, 2018 07:54 IST|Sakshi
అమూల్య మృతదేహం

విద్యార్థిని ఆత్మహత్య

బంజారాహిల్స్‌: కాలేజీ టూర్‌కు పంపించలేదని మనస్తాపానికి లోనైన ఓ యువతి నాల్గో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌రోడ్‌ నెం.2లోని ఇందిరానగర్‌లో ఉంటున్న లక్ష్మినారాయణ బేగంపేట పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతని కుమార్తె అమూల్య డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల యాజమాన్యం విద్యార్థులతో కలిసి టూర్‌ ఏర్పాటు చేసింది.

తన స్నేహితులతో కలిసి వెళ్తానంటూ అమూల్య తల్లిదండ్రులకు చెప్పగా వారు అందుకు అంగీకరించలేదు. దీంతో గురువారం రాత్రి ఫోన్‌ మాట్లాడుకుంటూ నాల్గో అంతస్తులోకి వెళ్లి కిందకు దూకడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. దూకుతూనే ‘అమ్మా అంటూ అరుస్తూ నేను చనిపోతున్నానంటూ’ అరిచింది. అరుపులు విని అప్రమత్తమైన తండ్రి లక్ష్మినారాయణ భార్యతో కలిసి కిందికి వచ్చేసరికే రక్తపు మడుగులో కూతురు విలవిల్లాడుతూ కనిపించింది. బాధితురాలిని శ్రీనగర్‌కాలనీలోని తన్వీర్‌ ఆస్పత్రికి తరలించగా అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఫోన్‌ మాట్లాడుతూ నాల్గవ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఐ కె. ఉదయ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు