‘గజల్‌’ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

2 Jan, 2018 18:57 IST|Sakshi

ఏ1గా శ్రీనివాస్‌, ఏ2గా పార్వతి

సాక్షి, హైదరాబాద్‌ : లైంగికి వేధింపులకు పాల్పడ్డి జైలు పాలైన గజల్‌ శ్రీనివాస్‌ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా గజల్‌ శ్రీనివాస్‌ను ఏ1గా, పనిమనిషి పార్వతిని ఏ2గా చేర్చారు. మహిళల పట్ల గజల్‌ శ్రీనివాస్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడని, అభ్యంతరకరమైన ప్రాంతాల్లో మసాజ్‌ చేయాలని బెదరించేవాడని వేధింపులు ఎదుర్కొన్న యువతి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోలను బాధితురాలు పోలీసులకు అందచేసింది.

గజల్‌ శ్రీనివాస్‌ తండ్రిలాంటివారు..
రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న పార్వతి మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ తనకు తండ్రి లాంటి వాడని తెలిపింది. ఆయన దగ్గర తాను చాలాకాలంగా పని చేస్తున్నానని, మహిళలను వేధించే వ్యక్తి కాదని చెప్పింది. ఆరోపణలు చేసిన ఆమె... తనకు తానుగా మసాజ్ చేస్తానని ముందుకొచ్చిందని పార్వతి ఆరోపిస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇంత స్థాయికి ఎదిగిన వ్యక్తి...ఓ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడంటే నమ్మేలా లేదని శ్రీనివాస్ ఫ్యామిలి ఫ్రెండ్ జ్యోతిర్మయి అన్నారు.

ఖైదీ నెంబర్‌ 1327
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ గజల్ శ్రీనివాస్ కు ఈ నెల 12 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు... గజల్‌ శ్రీనివాస్‌కు 1327 నెంబర్ ను కేటాయించారు.

మరోవైపు న్యాయమూర్తి రిమాండ్ ప్రకటించిన వెంటనే గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టులో వాదోపవాదనలు జరిగిన అనంతరం బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి రద్దు చేశారు. అలాగే గజల్ శ్రీనివాస్ ను రెండు వారాల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటీషన పై  విచారణ రేపటికి వాయిదా పడింది. 

మరిన్ని వార్తలు